Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

అదానీ అక్రమాలపై జేపీసీతో విచారణ

. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
. ఈసీల నియామకంపై సుప్రీం నిర్ణయానికి హర్షం
. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు ఓ నాటకం
. లోకేశ్‌, చంద్రబాబు అంటే జగన్‌కు భయమని వ్యాఖ్య

విశాలాంధ్ర -తిరుపతి బ్యూరో: అదానీ కంపెనీ అక్రమాలపై పార్లమెంటు సంయుక్త కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. వాస్తవానికి జేపీసీలో ప్రభుత్వ అనుకూల సభ్యులే ఎక్కువుగా ఉంటారని, అందువల్ల నివేదిక ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండానే ఉంటుందని నారాయణ చెప్పారు. అయితే, బహిరంగంగా విచారణ వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సెబీ ఇంతకాలం నిద్రపోయినట్లుందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కమిటీని ప్రకటించగానే అదానీ కంపెనీ దానిని స్వాగతించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించాల్సిన అవసరం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. దీనిని కొన్నవారు ‘తుక్కు’ కింద అమ్మేస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన 30 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని డంపింగ్‌ యార్డ్‌గా మారుస్తారని తెలిపారు. యూపీఏ హయాంలో రూ.400కు చేరిన గ్యాస్‌ ధరను మోదీ ప్రభుత్వం విజయవంతంగా రూ.1200కు పెంచిందని విమర్శించారు. ఏప్రిల్‌ 14 నుండి ‘మోదీ హఠావో దేశ్‌ బచావో’ నినాదంతో సీపీఐ దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతుందని ప్రకటించారు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈసీల నియామకంపై గతంలో మాదిరిగా ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ కమిటీ నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు ఒక నాటకమని, మూడేళ్ల క్రితం పరిశ్రమలను సీఎం జగన్‌ ఎందుకు ఆహ్వానించలేదని నారాయణ ప్రశ్నించారు. అమర్‌రాజా వంటి పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరలిపోయే స్థితి తీసుకువచ్చిన జగన్‌…కొత్త పరిశ్రమలను ఎలా తీసుకొస్తారని అడిగారు. సీఎం జగన్‌ భయపడుతున్నందునే లోకేశ్‌, చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటున్నారని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైసీపీకే బలం ఉందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధులు తిరగబడ్డారని, జగన్‌ తన నీడను తానే నమ్మడం లేదని, అందుకే నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పట్టభద్రులతోపాటు ఉపాధ్యాయుల ఓటర్లలోనూ దొంగ ఓట్లు చేర్పించి ఎలాగైనా గెలవాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే అనేకచోట్ల వామపక్ష కార్యకర్తలు దొంగ ఓట్లతో పాటు అధికార పార్టీ పంచుతున్న ఎన్నికల బహుమతులను పట్టుకున్నారని చెప్పారు. సీపీఎస్‌ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీల ఊసే లేదని, ఒక్క కొత్త ప్రాజెక్టును చేపట్టకపోగా పాత ప్రాజెక్టులను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈనెల 15లోపు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే ఉగాది తర్వాత తామే లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, కుమార్‌రెడ్డి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img