Friday, March 24, 2023
Friday, March 24, 2023

అదానీ ప్రకంపనలు

. కార్పొరేట్‌ మోసాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులపై చర్చకు విపక్షాల డిమాండ్‌
. పార్లమెంటులో ఎంపీల నినాదాలు
. 9 పార్టీల నోటీసులు
. ఉభయ సభలు రసాభాస, వాయిదా

న్యూదిల్లీ : అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపివేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల మోసాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులపై చర్చకు ప్రతిపక్షాలు ఐక్యంగా డిమాండ్‌ చేయడంతో చట్టసభల్లో ప్రకంపనలు సంభవించాయి. ఈ అంశాలపై తక్షణమే చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ రసాభాస అయ్యాయి. శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
అదానీ సంస్థపై ఆరోపణల మీద చర్చకు డిమాండ్‌ చేయడమే కాకుండా వాయిదా తీర్మానాలను విపక్షాలు ప్రవేశపెట్టాయి. వాటిని ఉభయ సభల సభాపతులు ఆమోదించలేదు. దీంతో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఆప్‌ తదితర ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో అదానీ వ్యవహారంతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో పెట్టుబడులపై చర్చకు డిమాండ్‌ చేశాయి. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి, అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పర్యవసానంగా లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగించింది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు పార్లమెంటు వాయిదా పడిరది.
జాంబియా పార్లమెంటరీ ప్రతినిధులకు ఆహ్వానం పలికిన అనంతరం ప్రశ్నోత్తరాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మొదలుపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు అదానీ వ్యవహారంలో చర్చకు డిమాండ్‌ చేస్తూ అనేక అంశాలనూ లేవనెత్తారు. ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. అదానీ వ్యవహారంతో పాటు చైనాతో సరిహద్దు వివాదం, గవర్నర్ల పాత్ర తదితర అంశాలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కేంద్రబడ్జెట్‌నూ విమర్శించారు. పెరుగుతున్న ధరలు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగానికి పరిష్కారం చూపే విధంగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు లేవని దుయ్యబట్టారు. 267 నిబంధన కింద తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభకు నోటీసులు ఇచ్చారు. అన్ని నోటీసులను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ తిరస్కరించారు. అవన్నీ క్రమబద్ధంగా లేవని అన్నారు. దీంతో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎంపీల నిరసన క్రమంలో ఎగువ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడిరది. భోజన విరామానికి ముందు కూడా సభలో వాయిదాల పర్వం కొనసాగింది. అటు లోక్‌సభలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. మధ్యాహ్నం సభ తిరిగి మొదలు కాగా ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ్యుల నినాదాల హోరులోనే పార్లమెంటరీ పత్రాల సమర్పణకు సభాపతిగా ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ అనుమతినిచ్చారు. కానీ కార్యకలాపాలు నిర్వహణ కష్టంగా మారడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img