. ప్రజలనే కలవని ఆయన ప్రజల మాట వింటాడా?
. ‘జగనన్నకి చెపుదాం’’పై రామకృష్ణ
విశాలాంధ్ర – విశాఖ: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ’జగనన్నకి చెబుదాం’ కార్యక్రమం హాస్యాస్పదమని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను కలవడానికీ, వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించడానికీ, రాజకీయ పార్టీల ప్రతినిధులను కలవడానికీ, చివరికి సొంత పార్టీ నాయకులను కూడా కలవడానికి అవకాశం ఇవ్వనీ, కార్యాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం విడ్డూరమని అన్నారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం పెట్టలేదని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించని ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. వెయ్యి మంది పోలీసులు ఉంటే తప్ప బయటకు రావడం లేదని, పరదాల మాటున పర్యటనల చేస్తున్నారని చెప్పారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తూ అసలు తన భవిష్యత్తే జగన్ కి తెలియదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ పై బయట ఉన్నారని గుర్తు చేశారు. బెయిల్ రద్దయితే పరిస్థితి ఏంటో తెలియదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల అప్రజాస్వామ్య పాలన సాగించిన ముఖ్యమంత్రి… మిగిలిన ఏడాది సమయంలోనైనా వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మే మూడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని, దీని ద్వారా కేంద్రం కళ్లు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోరుతున్న రెండు అంశాలు కేంద్రం తీర్చగలిగేవేనని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సొంత ముడి ఇనుము గనులు కేటాయించాలని, ఐదు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు కేంద్రానికి 50వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదాయం సమకూర్చిందని చెప్పారు. వేలాది మందికి ఉపాధి కల్పించిందన్నారు వేలాది మంది నుంచి భూములు సేకరించారని చెప్పారు. ఆ భూముల విలువ పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పారు. మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటు రంగానికి కట్టబెడితే సహించబోమని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి, కార్పొరేట్ రంగానికి అప్పగించాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని స్పష్టమైన వైఖరితో బీజేపీ ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కూడా వీటిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. మోదీ విధానాలనే జగన్ అనుసరిస్తున్నారని, అవే విధానాలను చంద్రబాబు కూడా అనుసరిస్తానంటే, ఆ విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని అన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై పార్టీ జిల్లా శాఖ నివేదిక రూపొందిస్తున్నదని, అనంతరం రాష్ట్రస్థాయిలో కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. మే డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సీపీిఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు పాల్గొన్నారు.