Friday, September 22, 2023
Friday, September 22, 2023

అధిక ధరలపై వామపక్షాల ఉద్యమం

30న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జయప్రదం చేయండి
ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలి
వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన వామపక్ష పార్టీల నేతలు
మోదీ, జగన్‌ ప్రజలపై బాదుడు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల భారం: సీపీఎం నేత గఫూర్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే పెంచుతున్న నిత్యవసర వస్తువుల అధిక ధరలు, పన్నుల భారాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఈనెల 30వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర నాయకులు ఎంఏ గఫూర్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు బి.రవిచంద్ర, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు బి.ఎస్‌.అమర్‌నాథ్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌, ఎంసీపీఐ(యూ) నాయకులు ఎస్‌కే ఖాదర్‌ బాషా, ఎజాష్‌బాషా తదితరులు ఈనెల 30న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న ధర్నాల వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్రోలు, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.121కు చేరి, ప్రజలపై పెనుభారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అధికారంలోకి రాక ముందు గ్యాస్‌ సిలిండరు ధర రూ.460 ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ.1,052కి చేరిందని వివరించారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి, ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వంట నూనెల ధరలను పెంచి ప్రజల నెత్తిన పెనుభారాలు వేశారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, స్టీలు టన్ను భారీగా పెరగడంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోందని, దానిపై ఆధారపడిన వారికి ఉపాధి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి తోడుగా రాష్ట్రంలోనూ అన్నింటా ధరలు పెంచుకుంటూ పోవడంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం ఆస్తి, నీటి, చెత్త పన్నులను విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాలు మోపిందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ 15 శాతమే ఆస్తి పన్ను పెంచామంటూ వ్యాఖ్యానించగా, వాస్తవంగా అది 32 శాతానికి పెంచి జగన్‌ ప్రభుత్వం ప్రజల నడ్డిని విరుస్తోందన్నారు. ఈ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసి, చెత్త ఆలోచనలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణీకులపై రూ.720 కోట్లు, విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై నాలుగు వేల కోట్ల రూపాయల భారాలు మోపడం దుర్మార్గమన్నారు. పది వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని, మే 25, 26 తేదీల్లో అన్ని పెట్రోలు బంకుల వద్ద కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంఏ గపూర్‌ మాట్లాడుతూ వంట నూనెలు, నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, కరెంటు, ఆర్టీసీ చార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నుల భారాలను విరమించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోనూ ఈనెల 30న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన ధర్నాలను వామపక్ష పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పెరుగుతుంటే, అటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనూ విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుతో నిత్యవసర ధరలు మరింత అధికమవుతున్నాయని విమర్శించారు. పెట్రోలు, డీజిల్‌ పెంపుతో ఇప్పటికే భారీగా కేంద్ర ప్రభుత్వం కూడగట్టుకుందన్నారు. ఏపీలో విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రతి ఇంటికీ రెట్టింపు చార్జీలతో బిల్లులు వస్తున్నాయని చెప్పారు. ఒక వైపు కేంద్రం, మరో వైపు రాష్ట్రం బాదుడితో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. డి.హరినాథ్‌ మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మోదీ, జగన్‌ పోటీపడి ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. అమర్‌నాథ్‌ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు దశల వారీగా తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌కే ఖాదర్‌ బాషా మాట్లాడుతూ టమాటా ధర కిలో రూ.90కి చేరిందని, నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img