Monday, February 6, 2023
Monday, February 6, 2023

అన్నదాతల అపూర్వ విజయం – సాగుచట్టాల రద్దు

రైతులు అధికార దర్పానికి బెదరలేదు. కేసులను పట్టించుకోలేదు. రోడ్లను ముళ్లకంచెలతో నింపివేసినా వెనక్కు తగ్గలేదు. ఏడాది పాటు నిరాటంకంగా పోరాడి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. వర్షాలు, ఎండ, చలిని చివరకు కోవిడ్‌ మహమ్మారిని సైతం లెక్కచేయకుండా ఉక్కు సంకల్పంతో తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించారు. పంజాబ్‌ నుంచి మొదలైన ఉద్యమం క్రమంగా దేశమంతటా వ్యాపించింది. అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రైతుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. అనేక దేశాధినేతలు మోదీ సర్కార్‌ తీరును దుయ్యబట్టారు. రైతులకు మద్దతిచ్చారు. ఎందరో ప్రముఖులు, మేధావులు, సెలబ్రిటీలు, కార్మిక, ప్రజా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లౌకికవాదులు, హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, వామపక్షాలు, రాజకీయ పార్టీలు సైతం రైతన్నకు అండగా నిలిచాయి. ఆందోళనలో భాగంగా 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు. తమ ఉద్యమం రాజకీయం కాకుండా రైతులు జాగ్రత్తపడ్డారు.
అనేక పార్టీల సంపూర్ణ మద్దతు ఉన్నా తమ వేదికపైకి ఏ నాయకుడిని అడుగు పెట్టనివ్వలేదు. తమ పోరాటం రాజకీయాలకు అతీతమని ప్రకటించారు. 40కిపైగా రైతు సంఘాల నేతలు ఒకే మాట.. ఒక బాటగా ఉద్యమాన్ని ముందుకు సాగించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చల్లోనూ వారంతా ఒకే మాటపై నిలబడ్డారు. ఏ ఒక్కరూ వారి ఊరింతలకు ఆశపడలేదు. తమ ఉక్కు సంకల్పం ముందు బీజేపీ సర్కార్‌ బెట్టు నీరుగారేలా చేయగలిగారు. వినాశకర మూడు సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు విశ్రమించకుండా పోరాడారు. తమ భవితవ్యాన్ని అంథకారం నుంచి కాపాడుకోగలిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img