Monday, February 6, 2023
Monday, February 6, 2023

అన్నదాతల ఉద్యమం మరింత ఉధృతం

హరియాణాలో బీజేపీ ఎంపీకీ నల్ల జెండాలతో నిరసన
హిస్సార్‌/న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమం మరింత ఉధృతమయ్యింది. ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతు సంఘాలు ఇప్పుడు నిర్ణయాత్మక అడుగులు వేయాలని భావిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ చట్టాలను నిరసిస్తూ హరియాణా రైతు సంఘాలు త్వరలో ఈస్టర్న్‌ ఔటర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే దిగ్బంధనానికి సన్నద్ధమవుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 7న హరియాణాలో రైతు సంఘాలు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. హరియాణా రైతు నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ చాదుని ఈ సమావేశం గురించి తెలియజేశారు. ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే రైతుల నిరసనోద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నవంబర్‌ 9న సింఘు సరిహద్దులో సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహం రూపొందిస్తామని తెలిపింది. నిరసనలు ప్రారంభమై ఏడాది కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం, పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో నిరసనలు మరింత ఉధృతం కానున్నాయి. కాగా గత ఏడాది నవంబర్‌ 26న రైతుల నిరసన ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకోనుంది. పార్లమెంటు సమావేశాలు కూడా నవంబర్‌ 23న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ నిరసనను మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలను తక్షణమే ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు శుక్రవారం హరియాణాలో ఆందోళన చేపట్టారు. హరియాణాలోని హిస్సార్‌ జిల్లాలో ధర్మశాల (సత్రం)ను ప్రారంభించేందుకు నార్నాండ్‌ నగరానికి వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్‌ చందర్‌ జంగ్రాను రైతులు నిర్బంధించారు. కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నల్ల జెండాలను చూపారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో ఎంపీ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇది తనపై కచ్చితంగా హత్యాయత్నమేనని ఎంపీ ఆరోపించారు. హరియాణాలోని అధికార బీజేపీ, జననాయక్‌ జనతా పార్టీ నాయకుల కార్యక్రమాలను అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. నల్లజెండాలతో నిరసనకారుల బృందం ఎంపీ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. రైతులను నిలువరించేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినా రైతులను అదుపు చేయలేకపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img