Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

అన్నదాత వెన్నులో వణుకు

. రేపు అల్పపీడనం… 8న వాయుగుండం, తుపాన్‌
. ఇప్పటికే అకాలవర్షాలతో రైతన్న అతలాకుతలం
. తాజాగా ఐఎండీ హెచ్చరికలతో బెంబేలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అకాలవర్షాలతో అల్లాడుతున్న అన్నదాతను తుపాను ముప్పు వెంటాడుతోంది. రాబోయే నాలుగురోజుల్లో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను(మోచా) ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. దీంతో అన్నదాత వెన్నులో వణుకు పుడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముందని, ఆ తర్వాత 8న తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముందని హెచ్చరించింది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపానుగా మారితే దీనికి ‘మోచా’ అని పేరు పెట్టనున్నారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కర్నాటక వరకు కొనసాగుతున్న ద్రోణి, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలిదుమారంతో కూడిన వర్షాలు కావడంతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాట్లిల్లింది. ప్రస్తుతం మామిడి దిగుబడి దశలో ఉండడంతో గాలి దుమారానికి కొమ్మలు, చెట్లు విరిగిపడి, కాయలు రాలి పంట మొత్తం నాశనమైంది. అరటి, మొక్కజొన్న విరిగి పడి పంట నీటపాలైంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కోతలు పూర్తయిన పొలాల్లో పనలు నీటనాని మొలకలెత్తే పరిస్థితి ఏర్పడిరది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మిరప పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అసలే ఈ ఏడాది తామరపురుగు మిరపతోటలను చావుదెబ్బ తీసింది. దీనికి ఏ పురుగు మందు కొట్టాలో కూడా తెలియక ఎవరు ఏం చెపితే ఆ పురుగు మందును పిచికారి చేసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు ఈ సంవత్సరం రెట్టింపయ్యాయి. మరో పక్క దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో పంటకు మంచి డిమాండ్‌ ఉండడంతో కొంత ఊరట చెందారు. ఈలోపే అకాలవర్షాలు కొంప ముంచాయి.
రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి: సీఎం జగన్‌
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథó్యంలో సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మరోసారి భేటీ అయ్యారు. ప్రతి జిల్లాలో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌లు తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పూర్తిగా అండగా నిలవాలని, నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటరాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం పెట్టాలని సీఎం సూచించారు. రానున్న రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులపై వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటకోసిన చోట పనలు తడిసిన ప్రాంతాల్లో ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి జిల్లాకు కూడా ఒక వ్యవసాయశాస్త్రవేత్తను అందుబాటులో ఉంచామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద, ఆర్బీకేల వద్ద, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్క జొన్న కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img