Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో 90 రోజుల్లో నియామకాలు

ఆ తర్వాత ఎక్కడా సిబ్బంది కొరత మాట తలెత్తకూడదు
కర్ఫ్యూ మరో గంట సడలింపు
పాఠశాలల్లో కోవిడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు
ఔషధాల్లో కల్తీల నివారణకు ‘సీఏఎస్‌ఐ’ వెబ్‌సైట్‌
సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు, బోధనాసుపత్రుల వరకు అన్నింటిలో వచ్చే 90 రోజుల్లో నియామకాల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్‌పై మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారి లాంటి వైరస్‌లను తట్టుకోవాలంటే వైద్య ఆరోగ్య శాఖను మరింత పటిష్టవంతం చేయాలని, దీనిలో భాగంగా నియామకాలపై అధికారులు దృష్టిపెట్టి వచ్చే మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఎక్కడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదని, ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లు తెరిచినందున కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా అమలయ్యేలా, మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో కరోనా పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో వాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని చెప్పారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున కర్ఫ్యూ మరో గంట సడలించాలని, దీనిప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులుంటాయని తెలిపారు. వివాహాలకు 150 మందికే అనుమతించాలని, తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 17,218 ఉండగా, రికవరీ రేటు 98.45 శాతం, పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఆగస్టు నెలాఖరు నాటికి 104 చోట్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తి అవుతాయని, మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు మొత్తం వాక్సినేషన్‌ 1,82,00,284 తీసుకోగా, రెండు డోసులు 66,01,563 మందికి వేసినట్లు వివరించారు. అనంతరం ఔషధ నియంత్రణ శాఖపై సమీక్షలో భాగంగా ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చేయడంలో దోహదకారిగా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలక్షన్‌ ఆఫ్‌ ఇన్స్ఫెక్షన్‌ ‘సీఏఎస్‌ఐ’ పేరిట నూతన వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తయారీ సంస్థల నుంచి రిటైల్‌ దుకాణాల వరకూ కూడా దీని పరిధిలోకి వస్తాయని, తనిఖీల్లో పారదర్శకత, నాణ్యత, నిరంతర ఫాలోఅప్‌ కోసమే కొత్త వెబ్‌సైట్‌ దోహదపడుతుందని తెలియజేయగా, డ్రగ్స్‌ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ఫాలో అప్‌ ఉండాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులపై కూడా నిరంతర తనిఖీలు చేయాలని, మందులు నాణ్యతతో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img