Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అపార నష్టం

ఉత్తరాంధ్రను దెబ్బతీసిన ‘గులాబ్‌’ తుపాను
25 వేల ఎకరాలకు పైగా పంట నష్టం

విశాలాంధ్ర బ్యూరో ` విశాఖపట్నం : ఉత్తరాంధ్ర జిల్లాల్లో గులాబ్‌ తుపాను రైతుల్లో కన్నీళ్లు నింపింది. తుపాను ప్రభావానికి అనేకచోట్ల ఇళ్లు నేలమట్ట మయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మూడు రోజులుగా వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఏజెన్సీలో పరిస్థితి మరింత దయ నీయంగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకలు సెలయేరులై పారుతున్నాయి. వేలాది మంది తుపాను బాధితులు ఇంకా పునరావాస కేంద్రాలలోనే తలదాచుకుంటున్నారు. అదే జోరు.. అదే హోరుతో ఉత్తరాంధ్రలో గులాబ్‌ అలజడి సృష్టించింది. సుమారు 25 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. వరి, జొన్న, అరటి, వేరుశెనగ, నువ్వులు, మినప, పెసర వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వాగులు, గెడ్డలు ఓ పక్క పొంగి పొర్లుతున్నాయి. అనేక చెరువులు, రహదారులకు గండ్లు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో అనేక గ్రామాలు జల దిగ్బం ధంలో ఉన్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కన్నా మైదాన ప్రాంతంలో పంటలకే ఎక్కువ నష్టం వాటిల్లింది. తుపాను ఉత్తరాంధ్ర రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రైతులు ఖరీఫ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ తుంచేసింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాలు నీట మునిగినట్టు అధికారుల అంచనా. వరి పంట సుమారు 3,700 హెక్టార్లలో మునిగిపోగా, జొన్న, మొక్క జొన్న, రాగి, వేరుశెనగ తదితర పంటలు 300 హెక్టార్లలో దెబ్బతింది. పంట

ప్రదేశాల్లో నీరు తగ్గితేగానీ అంచనా వేయలేమని అధికారులు ఓ పక్క చెబుతున్నారు. అయితే గులాబ్‌ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని వాతా వరణ శాఖ అంచనా వేసింది. తుపాను భారీ గాలులకు చెట్లు నేలకూలగా, విజయ నగరం జిల్లా గజపతినగరంలో 2,300 టేకు చెట్లు పడిపోయాయి. పంటలు నీటమునిగాయి. వరి, మొక్క జొన్న, పత్తి, మిరప, మినుము, వేరుశెనగ, రాజ్‌మా, చెరకు, పొగాకు, రాగి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగరంలో 26 వేలు, శ్రీకాకుళంలో 20 వేలు, తూర్పుగోదావరిలో 18 వేలు, విశాఖలో 6,500 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. శ్రీకాకుళం జిల్లాలో 14,761 ఎకరాలు, విజయనగరం 6,250 ఎకరాల్లో మొక్క జొన్న దెబ్బతింది. పంటలన్నీ నాశనం అయిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ జిల్లాలో 39 మండలాల్లో పంటలు వేయగా అరకు డివిజన్‌లో పెద్దగా ప్రభావం లేదు. కొండ ప్రాంతం కాబట్టి నీరు కిందకి వచ్చేస్తుంది. మైదాన ప్రాంతాలలో పంటలకు నష్టం వాటిల్లింది. చింతపల్లి డివిజన్‌ పరిధిలో జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాలలో రాజ్‌మా పంటలపై గులాబ్‌ ప్రభావం చూపించింది.
విశాఖ జిల్లాలో ఆరు మండలాలలో 28 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. పెందుర్తి, పెదగంట్యాడ, గాజువాక, విశాఖపట్నం రూరల్‌, మధురవాడకు చెందిన లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయని, ముందు జాగ్రత్తగా 10,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. వర్షం తగ్గిన తర్వాత ఉదయం చాలా మంది వారి ఇళ్లకు వెళ్లిపోయారని, ప్రస్తుతం 21 పునరావాస కేంద్రాలలో 2,100 మంది ఉన్నారని తెలిపారు. వారందరికీ నాణ్యమైన ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో గల 88 జలమయమైన లోతట్టు ప్రాంతాలు, కాలనీలలో నీటిని ప్రత్యేక మోటార్లతో తొలగిస్తున్నామని, మంగళవారం మధ్యాహ్నం నాటికి అన్ని కాలనీలలో నిలువ నీటిని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. 128 చెట్లు నేల కూలాయని, వాటిని తొలగించి రోడ్లను క్లియర్‌ చేశామని అన్నారు. కాగా గులాబ్‌ తుపాను ఉత్తరాంధ్రలో తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో ఈదురు గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అనేక చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో తీర ప్రాంతం వణికిపోయింది. విశాఖ నగరంలో ఉన్న రహదారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. తోటపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడంతో 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జంరaావతి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తనీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. భోగాపురంలో సముద్రం పది మీటర్ల మేర ముందుకొచ్చింది. అత్యధికంగా గార మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు సరఫరాకు ప్రయత్నం
‘గులాబ్‌’ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామని ఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి అతి తక్కువ సమయంలో పునరుద్ధరించగలిగారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పునరుద్ధరణ చర్యలు త్వరితగతిన పూర్తి చేశామని అన్నారు. వర్షాల కారణంగా ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన 103 మండలాల్లో 3,821 గ్రామాలలో 13,70,415 సర్వీసులకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడిరదన్నారు. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను, తెగిపడిన విద్యుత్‌ తీగలను, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లను సరి చేసినట్లు వివరించారు. వినియోగదారుల నుండి టోల్‌ ఫ్రీ నంబరు 1912కు, కంట్రోల్‌ రూమ్‌ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని వాటిని క్షేత్రస్థాయి సిబ్బందికి త్వరితగతిన తెలియజేయటం ద్వారా తక్కువ సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగలిగామన్నారు.
ఈ వర్షాల కారణంగా ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తంగా రూ.7.39 కోట్ల నష్టం సంభవించగా, అందులో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోనే రూ.5.03 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. 33/ 11 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్లు 380 దెబ్బతినగా 376 సబ్‌ స్టేషన్లను పునరుద్ధరించామని, 33 కెవి ఫీడర్స్‌ 276కుగాను 270, 11 కెవి ఫీడర్స్‌ 1,623కుగాను 1,448, 33 కెవి పోల్స్‌ 107కుగాను 87, 11 కెవి పోల్స్‌ 1,120కుగాను 588, ఎల్టీ పోల్స్‌ 1,719కుగాను 810, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్సఫార్మర్స్‌ 678కుగాను 290, 33 కెవి లైన్స్‌ 10 కిలోమీటర్లుకు 7, 11 కెవి లైన్స్‌ 51.19 కిలోమీటర్లుకు 39.34, ఎల్టీ లైన్స్‌ 66.58 కిలోమీటర్లుకు 45.50, సర్వీస్‌ కనెక్షన్లు 11,26,959కుగాను 10,24,306, వ్యవసాయ కనెక్షన్లు 4,767కుగాను 1,263 సర్వీసులను అతి తక్కువ సమయంలో 213 ప్రత్యేక బృందాలతో పునరుద్ధరించినట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img