Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

అప్పులపై ఆందోళనలు

11, 12 తేదీల్లో నిరసనలు
13న గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ధర్నాలు
ప్రజలపై మోదీ ధరల భారం
జగన్‌ బాదుడే..బాదుడు
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కేంద్రాన్నీ నిలదీయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న అధిక పన్నులు, ధరల భారాలకు నిరసనగా ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ప్రచారాందోళనలు, 13న గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ దాసరి భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించనున్న ప్రచారాందోళన, ధర్నాలలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంటనూనె ధరలు, విద్యుత్‌ చార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నుల పెంపును వ్యతిరేకిద్దామన్నారు. అనునిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పోతున్నారని, మోదీ ప్రధాని కాకముందు గ్యాస్‌ ధర రూ.460, పెట్రోలు రూ.64 ఉండేవని, ఇప్పుడు పెట్రోల్‌ లీటరు రూ.121కు చేరిందనీ, గ్యాస్‌ ధర అధికంగా పెరిగిపోయింద న్నారు. పెట్రో ఉత్పత్తులతోపాటు వంట నూనెలు, బియ్యం, పప్పు తదితర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయన్నారు. జగన్‌ ప్రభుత్వం సిమెంట్‌, పెట్రోల్‌, ఆస్తి, చెత్త పన్ను, విద్యుత్‌ చార్జీలు పెంచిందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు అన్న జగన్‌..ఇప్పుడు అన్నింటిపైనా ధరలు పెంచేశారని ఎద్దేవా చేశారు. ఇసుక, సిమెంట్‌, మద్యం అన్నింటిపై జె.టాక్స్‌ విధిస్తున్నారని దుయ్యబట్టారు. అవన్నీ చాలక గతంలో వినియోగించిన కరెంటుకు సంబంధించి ఒక్కో యూనిట్‌కు 0.23 పైసల వంతున విద్యుత్‌ సర్దుబాటు చార్జీలను ఆగస్టు 1 నుంచి అదనంగా పెంచేందుకు సిద్ధమవు తున్నారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి, కేటగిరీలను రద్దు చేసి, శ్లాబులను కుదించి ప్రజలపై పెనుభారాలు మోపారన్నారు. అదానీకి లబ్ధి చేకూర్చేలా మోదీ, జగన్‌ పనిచేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. కేంద్రం ధరలు పెంచుతుంటే..రాష్ట్రమే పెంచుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్‌ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్నీ నిలదీయాలని సూచించారు. ఒంటె అందాన్ని గాడిద పొగిడినట్లు పార్లమెంట్‌లో మోదీని వైసీపీ ఎంపీ విజయసాయి పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీని పొగుడుతుంటే ఇతర పార్టీలు అభ్యంతరం తెలిపాయని గుర్తుచేశారు. మోదీ వచ్చాకే దేశంలో ఉగ్రవాదం అంతమైందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఉగ్రవాద ఘటనలకు ఎవరు బాధ్యులంటూ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ప్రసంగాల పత్రికా/వీడియో క్లిప్పింగ్‌లను చంద్రబాబు, పవన్‌ రప్పించుకుని చూడాలన్నారు. బీజేపీ చేసే ప్రతి పనికి సిగ్గులేకుండా వైసీపీ మద్దతు తెలుపుతోందని దుయ్యబట్టారు. వైసీపీ, బీజేపీ కలిసి కాపురం చేస్తున్నాయని ఎండగట్టారు. బీజేపీ రూట్‌ మ్యాప్‌ తీసుకుంటే పవన్‌ కల్యాణ్‌ గుంటలో పడటం తథ్యమని సూచించారు. వైసీపీ, బీజేపీ రెండు పార్టీలు అంతర్లీనంగా కలిసి నడుస్తున్నాయని చెప్పారు. ఏపీలో కేబినెట్‌ విస్తరణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణ జవాబిస్తూ మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రికి గల విశిష్టాధికారమని, దానిని ఎవరూ కాదనలేరన్నారు. సీఎం నిర్ణయంతో పైకి కనిపించకపోయినా మంత్రులు లోపల ఏడుస్తున్నారని చెప్పారు. మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంతదారుణంగా చూసిన వ్యక్తిని తాము ఇప్పటివరకు చూడలేదన్నారు. మంత్రులకు పూర్తి అధికారాలు ఇవ్వకుండా, కేవలం అలంకార ప్రాయంగానే సీఎం ఉంచారని విమర్శించారు. కనీసం కొత్తగా వచ్చే వారికైనా వారి శాఖలు వారు నిర్వహించుకునే అధికారం ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రచారాందోళన, గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ధర్నాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.చెంచయ్యతో కలిసి రామకృష్ణ ఆవిష్కరించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పన్నుల భారాలపై మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను మీడియా ఎదుట ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img