Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అప్పులు ఆంధ్రులకు… ఆస్తులు అదానీకా…?

బొగ్గు టెండరులో అదానీతో లాలూచీ ఏంటి?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : జెన్కో విదేశీ బొగ్గు కొనుగోలు టెండరును అధిక ధరకు అదానీకి కట్టబెట్టడంలో వైసీపీ ప్రభుత్వానికి ఉన్న లాలూచీ ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. అప్పులు ఆంధ్రులకు, ఆస్తులు అదానీకి అప్పగిస్తారా? అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి అవసరమైన 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు గత జనవరిలో ఏపీపీడీసీఎల్‌ జారీ చేసిన టెండరు ప్రకటనతో వివిధ సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయని, ప్రైస్‌ బిడ్‌లో చెట్టినాడు సంస్థ ఎల్‌1గా నిలిచినప్పటికీ… తద్వారా రివర్స్‌ టెండరింగ్‌ వల్ల అదానీ సంస్థ ఈ బిడ్‌ను దక్కించుకుందన్నారు. 162 శాతం అధిక మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించిందని, దాని ఫలితంగా రూ.300 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా అదానీకి ఇచ్చేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పోర్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, సోలార్‌ పవర్‌ ఒప్పందాలు అదానీ కంపెనీలకు కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు బొగ్గు టెండరునూ అధిక ధరకు అదానీ కంపెనీకి ఇచ్చేసిందన్నారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా అదానీకి అప్పగించే కుట్రకు వైసీపీ సర్కార్‌ తెరదీస్తోందని, విద్యుత్‌, ట్రూఅప్‌ చార్జీలంటూ రాష్ట్ర ప్రజలపై పదేపదే గుదిబండ మోపుతున్న జగన్‌ సర్కార్‌ అదానీ కంపెనీలకు మాత్రం దాసోహమంటోందని ధ్వజమెత్తారు. అందినకాడికి అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై పెను భారాలు మోపుతూ… ఆంధ్రుల ఆస్తులు మాత్రం అదానీకి ధారాదత్తం చేస్తోందన్నారు. దేశమంతా అదానీ అవినీతి, అక్రమాల గురించి చర్చిస్తుంటే… రాష్ట్రంలో జగన్‌ మంత్రివర్గ సమావేశం నిర్వహించి భూములను అదానీ కంపెనీలకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. మోదీని, అదానీని ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌ పదేపదే ఉవ్విళ్లూరుతున్నారని, తద్వారా లబ్దిపొందేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. బొగ్గు కొనుగోలులో అదానీకి అధిక మొత్తం ఎందుకు చెల్లిస్తున్నారో సీఎం ప్రజలకు సమాధానమివ్వాలని, అదానీకీ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న లాలూచీ ఏమిటో బయటపెట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img