Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అప్పుల కుప్ప

తొలి త్రైమాసికంలోనే రూ.18వేల కోట్లకు చేరిన లోటు

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిఅప్పుల వేట
అధికార యంత్రాంగాన్ని వణికిస్తున్న ఫస్ట్‌ తారీఖు
నవరత్నాల చెల్లింపుల కోసం నిధుల మళ్లింపు
వివాదాస్పదమవుతున్న తాకట్టు వ్యవహారాలు

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతుండటంతో పాలనా యంత్రాంగాన్ని ఆర్థిక కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫస్ట్‌ తారీఖు ఎప్పుడు వస్తుందా? అని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తుండగా...వాటిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థంగాక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటున్నది. ముఖ్యంగా ఆర్థికశాఖాధికారులు నెలవారీ చెల్లింపుల ప్రక్రియను సజావుగా పూర్తి చేయడం కోసం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నవరత్నాల అమలుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ఇతర శాఖల నిధులను సంక్షేమానికే మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకానికి కూడా నిధులు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని శాఖల ఉద్యోగులకు, పెన్షనర్లకు 15వ తేదీ దాటినా జీతాలు రావడం లేదు. ప్రతినెలా సిబ్బంది వేతనాలు, పెన్షన్‌ చెల్లింపులు, వివిధ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు సహా ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించడానికి రావల్సిన ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ అవుతోంది. దీంతో రాష్ట్ర ఖజానా భారీ లోటులో కూరుకుపోతోంది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయ, ఖర్చు వివరాలను పరిశీలిస్తే రాష్ట్ర ఖజానా దయనీయ పరిస్థితికి చేరింది. గతేడాది మార్చి నుంచి కరోనా మహమ్మారి విజృంభించడం, దీని నివారణ కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పాటు అమరావతి రాజధాని నిర్మాణపనులు నిలిపివేయడం వంటి చర్యలు ఆదాయ వనరులను బాగా దెబ్బతీశాయి. దీనికితోడు ఈ ఏడాది కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభం కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఇసుక పాలసీ నిర్మాణరంగాన్ని కుదేలు చేసింది. పడిపోయిన ఆదాయాన్ని రాబట్టుకోవడం కోసం మద్యం ధరలను మూడురెట్లు అదనంగా పెంచి, సొంత బ్రాండ్లను ప్రభుత్వమే నేరుగా విక్రయిస్తోంది. పెట్రోలు, డీజిల్‌పై ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటే లీటరుకు రూ.3లు అదనంగా వ్యాట్‌ టాక్స్‌ వసూలు చేస్తున్నా ఆర్థిక లోటును భర్తీ చేయలేకపోతున్నారు. తొలి త్రైమాసికంలోనే రూ.30వేల కోట్ల లోటుకి చేరిందంటే, ఇక ఏడాది పూర్తయ్యే సరికి లక్షన్నర కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా రూ.5,037 కోట్లు ఆదాయం సమకూరగా, ఖర్చు మాత్రం రూ.15,166 కోట్లు పెట్టాల్సి వచ్చింది. మే నెలలో రూ.4,882 కోట్లు ఆదాయం రాగా, రూ.13,950 కోట్లు ఖర్చు పెట్టారు. జూన్‌లో మాత్రం ఆదాయం కొంత పుంజుకుంది. రూ.7,893 కోట్లు రాగా, ఖర్చు కూడా గణనీయంగా పెరిగి రూ.18,200 కోట్లకు చేరింది. తొలి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.17,882 కోట్లు ఆదాయం రాగా, రూ.47,118 కోట్లు ఖర్చు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రూ.29,306 కోట్ల లోటుకి పడిపోయింది. మరోపక్క ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి ఇప్పటికే మించిపోయినట్లు కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఏపీ ప్రభుత్వం తన లెక్కల్లో తెలంగాణ వాటానూ కలిపి చూపించి అధిక రుణం తీసుకుందని, అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణ పరిమితిలో కోత పెడుతున్నట్లు కేంద్రం లేఖ రాయడం గమనార్హం. అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.41,043.18 కోట్ల ఖర్చుకు లెక్కాపత్రాల్లేవని, వీటిపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని కోరారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) నుంచి తీసుకొచ్చిన అప్పును, అందుకోసం ఇచ్చిన గ్యారెంటీ ఒప్పందాలను రహస్యంగా ఉంచారని, రూ.25వేల కోట్లకు వివిధ బ్యాంకులకు ఇచ్చిన గ్యారెంటీలను దాచిపెడుతోందని ఆ ఒప్పంద పత్రాలను కేశవ్‌ బహిరంగపర్చారు. వైజాగ్‌లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ పక్క అప్పుల భారం పెరగడం, మరోపక్క అప్పుల కోసం వేట, ఇంకోవైపు సంక్షేమ పథకాల అమలు జగన్‌ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img