Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌

. దేశ ప్రజల తలరాత మార్చడమే బీఆర్‌ఎస్‌ లక్ష్ష్యం
. గెలవాల్సింది నేతలు కాదు… రైతులు, ప్రజలు
. భారత్‌ పేద దేశం కాదు: కేసీఆర్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి… పోయాయి… ప్రధానులు వచ్చారు…. పోయారు. కానీ వారిని నమ్ముకుని ఓట్లు వేసిన మన బతుకులు మాత్రం మారలేదని బీఆరెస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. దేశ ప్రజల తలరాతలు మార్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి మీ ముందుకు వచ్చామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తరువాత ఇతర రాష్ట్రాల్లో తొలి బహిరంగ సభను ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశామని దానికి అనుగుణంగా అడుగులు వేస్తామన్నారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్‌, ఫూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో నాయకుల ఆలోచనల్లో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన నేటికి రాష్ట్రాలు నీటివనరుల కోసం జగడం చేయాల్సిన దుస్థికి కారణం ఇంతకాలం పాలించిన పాలకులు కాదా అని ప్రశ్నించారు. నేటికీ చాలా గ్రామాల్లో ప్రజలు తాగేందుకు నీరు కూడా లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో అనేక వనరులు ఉన్న నేటికి రైతాంగానికి కావాల్సిన విద్యుత్‌ను అందించడంలో పాలకులు విఫలం అవుతూనే ఉన్నారని మండిపడ్డారు. ఒకవైపు పండిరచిన పంటలకు ధరలు రాక ఏటా వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అంతటికీ కారణం దేశాన్ని పాలించిన పాలకులు కాదా అని నిలదీశారు. అసలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంతో ఆవేదన ఉంటేనే రైతులు ప్రాణ త్యాగాలకు సిద్ధం అవుతారన్నారు. ఇవన్నీ చూసిన తరువాతనే అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో బీఆర్‌ఎస్‌ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. దేశంలో దుస్థితిని చూసిన తర్వాత ఈ స్థితిని మార్చాలని సంకల్పించామని, మా సంకల్పానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మాది రాజకీయ ఆరాటం కాదని జీవన్మరణ పోరటంగా ఆయన అభివర్ణించారు. దశాబ్దాలుగా మార్పు కోసం ఎదురు చూశాము. కానీ అది ఆశించిన మేర జరగలేదన్నారు. ఇంకా వేచిచూసే పరిస్థితుల్లో లేమని మనల్ని మనమే మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు… ప్రజలు…. రైతులు. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు నిత్యం పాలకుల చేతిలో వంచనకు గురవుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రైతులే రోల్‌ మోడల్‌
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. కానీ రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని దీని వల్ల నేడు యావత్తు దేశానికే తెలంగాణ రైతాంగం రోల్‌ మాడల్‌గా నిలిస్తోందన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని, రైతులు ఏ కారణంతో మరణించిన 4 రోజుల్లోగా రూ.5 లక్షల చెక్‌ అందిస్తామని చెప్పారు. రైతు బీమా, రైతుబంధుతో ఆదుకుంటున్నామని, రైతులు పండిరచిన పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణలో తీసుకొచ్చిన ఈ పథకాలు మహారాష్ట్రాలో ఎందుకు లేవు, దేశవ్యాప్తంగా ఎందుకు లేవని ప్రశ్నించారు. రైతు రాజ్యం వస్తేనే కరువు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పుకొచ్చారు.
అవినీతిలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ
భారత్‌ పేద దేశం ఎంతమాత్రమూ కాదని, అమెరికా కంటే ధనవంతమైన దేశమని కేసీఆర్‌ వెల్లడిరచారు. దేశంలో ఇంతకాలం పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ నిత్యం అవినీతిలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. నిత్యం ఒక్కరి పై ఒక్కరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నామన్నారు. భారత్‌లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకొకటి లేదని కానీ దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్‌, 16 ఏళ్లు బీజేపీ పాలించాయి మరి ఇవి ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని ఆరోపించారు. నువ్వు అంత తిన్నావంటే,… నువ్వు ఇంత తిన్నావని… తిట్టుకుంటాయని విమర్శించారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు,… చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నాందేడ్‌లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కపెట్టారా? అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ చిన్న దేశంలో ఉందని వివరించారు. ఇంత విశాల భారత్‌లో కనీసం 2,000 టీఎంసీల రిజర్వాయర్‌ ఎందుకు లేదని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడం లేదని తెలిపారు. ట్రైబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్దీ జలవివాదాలు పెండిరగ్‌లో పెడతారని కేసీఆర్‌ అన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా తిప్పుతారని ఆరోపించారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
నాందేడ్‌లో ఘనస్వాగతం
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్‌ సింగ్‌ ఎయిర్‌ పోర్ట్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేరుకున్నాక తెలంగాణ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గురుద్వారాకు బయలుదేరి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి సభాప్రాంగణమైన నాందేడ్‌లోని సచ్‌ఖండ్‌బోడ్‌ మైదానంలోని బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు వచ్చారు. అక్కడ ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ కూడా ఉన్నారు. సభావేదిక పైకి చేరుకున్న కేసీఆర్‌ ముందుగా శివాజీ, అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. సభ అనంతరం సీఎం కేసీఆర్‌ సమక్షంలో అనేమంది మరాఠా నేతలు పార్టీలో చేరారు. వీరికి పార్టీ గులాబీ కండువాలు కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. మహిళా సర్పంచులకు ఎమ్మెల్సీ కవిత కండువాలను కప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img