Friday, June 9, 2023
Friday, June 9, 2023

అభివృద్ధికి గుదిబండ జగన్‌

. పరాకాష్ఠకు సీఎం ప్రచార పిచ్చి
. విశాఖ ఉక్కుపై సజ్జల డ్రామాలు
. కేటీఆర్‌కు సమాధానమివ్వాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ గుదిబండలా మారారని, పోలవరం నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. జగన్‌ ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ధ్వజమెత్తారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై చర్చ జరుగుతుంటే...విషయ పరిజ్ఞానం లేని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఏదేదో మాట్లాడుతున్నారని, అన్నీ తెలిసిన సజ్జల రామకృష్ణారెడ్డీ అసత్యాలు బొంకుతున్నారని రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించిందని, మోదీజగన్‌ కలిసి దానిని అదానీకి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అదానీ డబ్బులకు కక్కుర్తిపడి జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. జగన్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించి…అదానీకి భూములు అప్పగించారన్నారు. కృష్ణపట్నం, గంగవరం తదితర పోర్టులను అదానీకి ధారాదత్తం చేశారని, పవర్‌ ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తలచుకుంటే ఉక్కు ఫ్యాక్టరీని నడపలేదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం ద్వారా ఆ స్థలాలు అమ్ముకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కుపై మోదీకి జగన్‌ మంచి సలహా ఇచ్చాడంటున్న సజ్జల…ఆ సలహా ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలోనూ జగన్‌ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దృష్టి మళ్లింపు రాజకీయాలకు తెరదీశారని, రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. ఏపీకి జగన్‌ ఓ గుదిబండలా మారారని దుయ్యబట్టారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌ వేస్తే జగన్‌ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. అదానీతో జగన్‌ కుమ్మక్కయ్యారని, ఆయనకు వేల కోట్ల రూపాయల భూములు ధారాదత్తం చేశారన్నారు. మోదీ, అదానీ, జగన్‌ ఒక టీమ్‌గా ప్రభుత్వ ఆస్తులు దోచేస్తున్నారని దుయ్యబట్టారు. వాటిని తాము బయట పెడితే టీడీపీకి మద్దతిస్తున్నామని ఏడుస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం జగన్‌ సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.
డాక్టర్‌ అచ్చెన్న హత్యపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. డాక్టర్‌ అచ్చెన్న హత్యపై పోలీసుల స్పందన అనుమానంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా చేశారని ప్రశ్నించారు. జిల్లాస్థాయి అధికారి విషయంలోనే ఇలా వ్యవహరిస్తే…సామాన్య ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. అచ్చెన్న కుటుంబీకులను సీఎం, హోంమంత్రి కనీసం పరామర్శించలేదన్నారు. దళితుడు కాబట్టే ప్రభుత్వ పెద్దలకు చిన్నచూపుగా ఉందని వ్యాఖ్యానించారు. దళిత, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులను నిరసిస్తూ అఖిలపక్షం, ప్రజాసంఘాలతో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.
‘మా భవిష్యత్తు నువ్వే జగన్‌’ అంటూ….ఇంటి డోర్లపై బలవంతంగా స్టిక్కర్లను వైసీపీ ఎమ్మెల్యేలు, శ్రేణులు అంటించడాన్ని రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్‌ రద్దు అయితే జగన్‌ ఏ జైలుకు పోతారో తెలియదని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ స్టిక్కర్లు వేయడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు ప్రచారపిచ్చి పరాకాష్ఠకు చేరిందని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రజల సొంత ఆస్తులపై జగన్‌, వైసీపీ బొమ్మలతో పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తుల హక్కు పత్రాలపైనా జగన్‌ ఫొటోలు వేయడాన్ని తప్పుపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img