Friday, March 31, 2023
Friday, March 31, 2023

అమరావతిపై ఇరకాటంలో వైసీపీ

. బంతిని సుప్రీంకోర్టులోకి నెట్టిన కేంద్రం
. విభజన చట్టం మేరకే రాజధాని ఏర్పాటని స్పష్టీకరణ
. అందుకే రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని వెల్లడి
. పార్లమెంటులో, కోర్టులోనూ గతానికి భిన్నంగా కేంద్ర వైఖరి
. విశాఖకు తరలింపుపై నీరుగారిన పాలకపెద్దల ఉత్సాహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి రాజధాని వ్యవహారంలో అధికార వైసీపీ ఇరకాటంలో పడిరది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అండతో మూడు రాజధానుల నాటకం ఆడిన వైసీపీ, కమల నాథుల రాజకీయ ఉచ్చులో పడి గిలగిలలాడు తున్నారు. గతంలో హైకోర్టులో అమరావతి కేసు విచారణ సందర్భంగా, పార్లమెంటులో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని స్పష్టం చేసిన కేంద్రం… తాజాగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోకి నెట్టేసింది. 2014 ఏపీ పునర్విభజన చట్ట నిబంధనల మేరకే అమరావతి రాజధాని ఏర్పాటైందని, ఆమేరకే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.2,500 నిధులు విడుదల చేసినట్లు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే పార్లమెంటులోనూ అమరావతి రాజధానిపై గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. దీంతో ఈసారి ఉగాది పండుగ నాటికి ఎట్టిపరిస్థితుల్లో సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించాలన్న ఉత్సాహంతో ఉన్న వైసీపీ అధిష్ఠానం ఆశలు నీరుగారాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పాట పాడుతూ అమరావతిని విధ్వంసం చేసిన వైసీపీ ప్రభుత్వం, విశాఖపట్నానికి పరి పాలనా రాజధాని తరలింపుకు విశ్వయత్నం చేస్తోంది. అయితే రాజధాని నిర్మాణానికి ఉచితంగా భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో విభజన చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లు చెల్లదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. అలాగే కోర్టు తీర్పుకు భిన్నంగా ఏ ప్రభుత్వ శాఖ కార్యాలయాన్ని తరలిం చినా ఆ శాఖ ముఖ్యకార్యదర్శిపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. దీంతో కనీసం సీఎం క్యాంపు కార్యాలయ మైనా విశాఖకు తరలించి, అక్కడే సమీక్షలు నిర్వహించడం ద్వారా పరిపాలనా రాజధాని విశాఖేనన్న భ్రమ ప్రజలకు కల్పించాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. దీనికి కూడా సాంకేతికంగా అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉండడంతో వాయిదాలు వేస్తూ వస్తోంది. గత మూడేళ్లుగా ప్రతి ఉగాదికి తరలింపు ఖాయమనే ప్రచారం నిర్వహిస్తున్నారు. విచిత్రమేమిటంటే హైకోర్టు స్పష్టంగా అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చినా, వైసీపీ పాలకపెద్దల వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టులో స్వయంగా అఫిడవిట్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అమరావతిపై పాలకపెద్దలకున్న వ్యతిరేకతకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. సుప్రీంకోర్టు అమరావతి రాజధాని కేసుపై ఈనెల 23వ తేదీ విచారణ జరుపుతామని వెల్లడిరచింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయాన్ని అయినా తరలించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఉగాది నాటికి వైజాగ్‌ బీచ్‌ రోడ్డులో ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారపార్టీ నేతలే చెపుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 30వేల మంది రైతులు 34వేల ఎకరాల భూములు ఉచితంగా ఇవ్వడం, ఆ భూముల్లో సుమారు 50వేల విలువైన నిర్మాణ పనులు ప్రారంభం కావడం, గత ఏడేళ్లుగా ఇక్కడనుంచే పరిపాలన జరుగుతున్న నేపధ్యంలో అమరావతి రాజధాని తరలింపు అసాధ్యమని వైసీపీ నేతలే అంతర్లీనంగా అంగీకరిస్తున్నారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడైనా పెట్టుకునే అధికారం ఉన్నందున, ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఇకపై విశాఖలోనే సీఎం తిష్టవేసి అక్కడే అన్ని శాఖల సమీక్షలు జరపడం ద్వారా…చెప్పిన మాట ప్రకారం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించామని విస్తృత ప్రచారం చేసుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో ప్రజాభిమానం పొందే అవకాశం ఉంటుందని అధికారపార్టీ నేతలు ఆశపడుతున్నారు. ఇక మరోవైపు కోర్టులో రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందని నిరూపించుకోవడం ద్వారా చట్టపరంగా మూడు రాజధానుల పంతం నెగ్గించుకునేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు విశ్వయత్నం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేంద్రం అఫిడవిట్‌ కు కౌంటర్‌ గా ఏపీ సర్కార్‌ గతంలో వికేంద్రీకరణకు మద్దతుగా శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్ట్‌ను తెరపైకి తెస్తోంది. ఆ కమిటీ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని సుప్రీంకోర్టులో బలంగా వాదించి, కేసు నెగ్గాలనే ధోరణిలో వైసీపీ ఉంది. అయితే అమరావతి రాజధాని విషయంలో కేంద్రం చేస్తున్న వాదన చూస్తుంటే దీనిపై తాము ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే తమకు శిరోధార్యమని చెప్పేసినట్లయింది. అందుకే సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తాము జోక్యం చేసుకోవడం లేదని, ప్రస్తుతానికి అమరావతి రాజధాని అని మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానుల వ్యవహారంలోనూ జరిగింది జరిగినట్లుగానే వివరణలోనూ, అఫిడవిట్లోనూ పేర్కొంది. వాస్తవానికి ఏపీ సర్కార్‌ అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెచ్చిన సందర్భంలోనూ కేంద్రం వాటిని సమర్ధించడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. గతంలో హైకోర్టులో మాత్రం రాజధాని ఎంపిక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అందుకే అమరావతిని ఎంచుకున్నప్పుడు అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. ఇప్పుడు కూడా దాదాపు ఆ విషయాన్నే మరోరకంగా అటుతిప్పి ఇటుతిప్పి సుప్రీంకోర్టుకు చెప్పేసింది. తద్వారా తన కోర్టులో ఉన్న బంతిని సుప్రీంకోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకుంది. దీంతో విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు సాధ్యమేనా ? అనే అంశంపై రాష్ట్రంలో ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img