Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

అమరావతిపై మౌనమెందుకు?

. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి
. 1300 రోజు దీక్షా శిబిరంలో వక్తలు

విశాలాంధ్ర – తుళ్లూరు : అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాజధాని రైతులు చేపట్టిన మహోద్యమం ఆదివారానికి 1300వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని రాజధాని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలో కొనసాగుతున్న దీక్షా శిబిరానికి అన్ని పార్టీల నాయకులు సంఫీుభావం తెలిపారు. తొలిసారి న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆవేదనతో మృతి చెందిన రైతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి విషయంలో బీజేపీ మద్దతుతో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ అమరావతి నిర్మాణానికి చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని వైసీపీ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేస్తుంటే మోదీ, అమిత్‌ షా ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. ఆర్‌-5 జోన్‌లో సెంటు స్థలం పంపిణీ పేదలపై ప్రేమ వల్ల కాదని అన్నారు. రానున్న ఎన్నికలు జగన్‌ రావాలా… పోవాలా… అనే అజెండాతో జరుగుతాయన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ అమరావతి మహిళలు దృఢ సంకల్పంతో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి వలనే 1300 రోజుల పాటు ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతుందన్నారు. దేశ చరిత్రలో ఇటువంటి ఉద్యమం జరగలేదని, రైతులను హింసించిన ఏ ప్రభుత్వం నిలబడలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాదీశ్వర రావు మాట్లాడుతూ గతంలో కోర్టులను ఆశ్రయించే సందర్భంలోనే అమరావతిని ఎవరూ కదల్చలేరని చెప్పానని, ఇప్పుడు కోర్టులు కూడా అమరావతికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని అన్నారు. అనేక వాయిదాల తరవాత సుప్రీం కోర్టులో కూడా అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. జగన్‌ కోర్టు తీర్పులను లెక్క చేయకుండా మొండిగా ముందుకు వెళుతున్నారని అన్నారు. మహిళా రైతుల పోరాటం అద్వితీయమని కొనియాడారు. మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర నాయకులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం, ఉద్యమం, అరెస్టులు, నిర్భందాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. జగన్‌ దుర్మార్గపు పాలనకు తెరపడాలంటే రాష్ట్రంలో అధికార మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి అంశం 175 నియోజకవర్గాల్లో ప్రధాన అజెండాగా నిలవాలన్నారు. సీపీఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ ఎనిమిది బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా కేంద్రం అమరావతి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. నిధులను రాబట్టుకునేందుకు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. రాజధాని అమరావతికి సీపీఎం కట్టుబడి ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకరరావు, శివారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, దళిత బహుజన పరిరక్షణ సమితి నాయకులు పోతుల బాల కోటయ్య, బీజేపీ నాయకులు దారా సాంబయ్య, చిగురుపాటి రవీంద్ర బాబు, టీడీపీ నాయకులు పిల్లి మాణిక్యరావు, ధనేకుల సుబ్బారావు, చిలకా విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img