Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

అమరావతి ఉద్యమం చరిత్రాత్మకం

. ఎన్ని కుట్రలు చేసినా అంగుళం కదలదు
. రైతులకు అండగా ఉంటాం
. రాజకీయ నేతల హామీ
. 1200వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం
. సీపీఐ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ సంఫీుభావం

విశాలాంధ్ర`తుళ్లూరు : ఎన్ని కుట్రలు చేసినా అమరావతి రైతుల ఉద్యమాన్ని జగన్‌ ప్రభుత్వం అడ్డుకోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. అమరావతి రైతుల పోరాటం శుక్రవారంతో 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతు జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 1200 రోజులుగా రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఇదే సుదీర్ఘ పోరాటమని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పోరాటాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని రామకృష్ణ కొనియాడారు. ముఖ్యమంత్రి వారానికి రెండుసార్లు అమిత్‌ షా దగ్గరికి వెళుతున్నారని, అమిత్‌ షా అనుగ్రహం లేకపోతే జగన్‌ జైలులో ఉంటారని చెప్పారు. రాజధాని ప్రజలు, రైతులను సీఎం జగన్‌ మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని జగన్‌ను ప్రశ్నించారు. తాడేపల్లిలోనే ఇళ్లు కట్టుకున్నామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించకోవడం మోసం కాదా అని నిలదీశారు. జగన్‌ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా రైతులు టెంటు తీయలేదన్నారు. పోలీసుల్లోనూ మార్పు వచ్చిందని, గ్రామాల్లో ర్యాలీలు చేస్తుంటే సహకరిస్తున్నారని తెలిపారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారం అమరావతిని నీరుగారుస్తోందన్నారు. జగన్‌ మూర్ఖపు ఆలోచన కారణంగా వేలకోట్ల రూపాయల ప్రజాధనంతో అమరావతిలో జరిగిన నిర్మాణాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో భూమిలేని కూలీలకు రూ.5 వేల పెన్షన్‌ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. రాజధానిని అస్తవ్యస్తం చేసి… రైతులను, ప్రజలను నట్టేట ముంచిన నేరం బీజేపీ, వైసీపీలదేనని మండిపడ్డారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాట్లాడుతూ వైసీసీ దుర్మార్గాలకు ఎదురొడ్డి రైతులు ఉద్యమిస్తున్నారన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారన్నారు. అమరావతి 29 గ్రామాలది కాదని, ప్రపంచంలోని కోట్లాది తెలుగు ప్రజలదని, అమరావతి నుంచి ఒక్క మట్టిపెల్లను కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయని దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ అమరావతికి అసెంబ్లీలో అంగీకరించి తర్వాత జగన్‌ మాట మార్చారని ఆరోపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా శాసనమండలి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ టీడీపీ గెలుస్తుందని చెప్పారు. టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్‌ పూర్తిగా అమరావతిపై ఆధారపడి ఉందన్నారు. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను నమ్మి ఎంతోమంది భాగస్వాములు అమరావతి వచ్చారన్నారు. ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ విక్రమార్కుడు కాదని, విక్రయమార్కుడని ఎద్దేవా చేశారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వైజాగ్‌లో భూములు అమ్ముకోవడం కోసమే రాజధాని మార్పు అని మండిపడ్డారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అమరావతికి కట్టుబడి ఉందని, అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు అమరావతి రాజధాని ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తుందన్నారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య మాట్లాడుతూ జై జగన్‌ అని అనకపోతే కార్యకర్తల్ని సైతం గొంతుకోసి చంపుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img