48 గంటల దీక్షకు సిద్ధమైన శ్రావణ్‌కుమార్ అరెస్టు
మహిళలు, వృద్ధులను సైతం లాగి పడేసిన పోలీసులు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అమరావతి రాజధాని రైతులపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రైతులు ఎప్పుడు ఆందోళనలకు పిలుపునిచ్చినా వేలమంది పోలీస్ బలగాలను దించి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ప్లాట్లను నాలుగేళ్లుగా కనీసం అభివృద్ధి చేయని రాష్ట్ర ప్రభుత్వం... వారిచ్చిన భూములను ఆర్
5 జోన్ పేరుతో ఇతర ప్రాంత పేదలకు ఇస్తున్న సెంటు భూములను మాత్రం యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసింది. ఈనెల 26న లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఆర్5 జోన్‌కి వ్యతిరేకంగా జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ 48 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. దీనిని భగ్నం చేసేందుకు అధికారపార్టీ వ్యూహాత్మకంగా ఆర్
5 జోన్‌కి అనుకూలంగా ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఇదే అదనుగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 విధించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ రైతులను అరెస్టు చేశారు. అమరావతి రైతుల తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా టీడీపీ అధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్దకు వందల సంఖ్యలో చేరుకున్న పోలీస్ బలగాలు ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు వారిని లాగి పడేశారు. దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యానుల్లోకి బలవంతంగా నెట్టేశారు. దీక్షకు సిద్ధమైన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే ఈ అడ్డంకులేమిటని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా స్థలంలో మేం మూడేళ్లుగా దీక్షలు చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములివ్వడమే మేం చేసిన పాపమా? మమ్మల్ని ఈ ప్రభుత్వం ఎందుకు వేధిస్తోందని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు. దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదంటూ మూడేళ్లుగా దీక్షలు చేస్తున్న తుళ్లూరు దీక్షా శిబిరానికి ఎవరొచ్చినా బలవంతంగా అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.
పిరికిపంద ప్రభుత్వం: శ్రావణ్‌కుమార్
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ.. పరిపాలన చేస్తున్నారని జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. జగన్ పాలన చూస్తుంటే సిగ్గుగా ఉందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ… హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు అవినీతికి తావులేకుండా, ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రతిబింబిస్తున్నాయని, ఇప్పుడు ఆయనను చూస్తుంటూ పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసగించినట్లు స్పష్టమవుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో పేదల కోసం నిర్మించిన 5 వేల పైచిలుకు టిడ్కో ఇళ్లను నాలుగేళ్లుగా లబ్ధిదారులకు కేటాయించని సీఎం జగన్… ఇతర ప్రాంత ప్రజలకు రైతుల భూములిస్తాననడం దుర్మార్గమన్నారు. రైతులకు న్యాయం కోసం తాను అమరావతిలో దీక్షకు పూనుకుంటే పోలీసులతో భగ్నం చేస్తారా అని శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలంలో 5 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ఎప్పుడైతే తన దీక్షను అడ్డుకున్నారో అపుడే ఈ ప్రభుత్వం పిరికిపందగా మారిందన్నారు. తనను ఎక్కడైతే అడుగుపెట్టనివ్వబోమని విర్రవీగారో…వారికిది చెంపపెట్టు అని, షంషేర్‌గా అక్కడ అడుగుపెట్టానని, భవిష్యత్‌లో ఇదేవిధంగా అమరావతి రైతుల తరపున పోరాడతానని స్పష్టం చేశారు. తన దీక్షకు మద్దతుగా తుళ్లూరు శిబిరం వద్దకు తరలివచ్చిన మహిళా తల్లులకు, రైతులకు శ్రావణ్ కుమార్ వందనాలు తెలిపారు.