Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

అమరుల స్ఫూర్తితో ముందుకు

ఉక్కు ఉద్యమానికి అపూర్వ మద్దతు
విశాఖలో విద్యార్థి, యువజనుల భారీ ర్యాలీ

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిరక్షణకు విద్యార్థులు సైతం ముందుకు వచ్చారు. మేము సైతం అంటూ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాముల య్యారు. అండగా ఉంటామని, ఫ్యాక్టరీని కాపాడుకుందామని ఉక్కు కార్మికులు, నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ అనేది కేవలం ఈ ప్రాంత సమస్య మాత్రమే కాదని, ఇది జాతీయ సమస్య అని ఏఐపస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేసరి అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక అధ్వర్యంలో సోమవారం విశాఖ పాతపోస్టాఫీసు వద్ద స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం పోరాడి అమరు లైన ఉద్యమకారులకు నివాళి అర్పించారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును అమ్మొద్దని డిమాండ్‌ చేశారు. 1966 నవంబరు ఒకటన విశాఖ ఉక్కు సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఇదే పాత పోస్టాఫీసు ప్రాంతంలో జరిగిన పోలీసు కాల్పులకు 12 మంది బలయ్యారు. వారి స్మారకార్ధం ఇక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ వద్ద పుష్పగుచ్చాలతో జోహార్లు అర్పించారు. విక్కీ మాట్లాడుతూ స్టీల్‌ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం దిల్లీని తాకాలన్నారు. నినాదాలు బీజేపీ పెద్దల చెవుల్లో గింగిర్లు తిరగాలని సూచించారు. పోరాటాల ద్వారానే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్నామని, మళ్లీ అదే పోరాటంతో విశాఖ స్టీల్‌ను నిలబెట్టుకోవాలని అన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ముయాక్‌ బిశ్వాస్‌ మాట్లాడుతూ కార్పొరేట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 35వేల మంది ప్రత్యక్షంగా, లక్షమంది పరోక్షంగా పని చేస్తున్నారన్నారు. ఇది విశాఖ అభివృద్ధికి వెన్నెముకగా, దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నదన్నారు. మోదీ సర్కారు మేకిన్‌ ఇండియా జపం చేస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ కార్యకర్త డా.కొల్లా రాజమోహన్‌ మాట్లాడుతూ 1966 నవంబరు ఒకటిన పోలీసుల తూటాలకు బలైన అమరవీరులతో తడిసిన నేలపై మనం ఉన్నామన్నారు. కేంద్రం తొలి నుంచీ ఏపీపై సవతిప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కార్మికుల శ్రమతో ఉక్కు పరిశ్రమ దినదినాభివృద్ధి చెంది…రూ.3.20 లక్షల కోట్ల విలువైన ఆస్తిగా మారిందని, దీనిని బీజేపీ రూ.2500 కోట్లకు అమ్మకానికి పెట్టిందన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ దేశంలో 5వ అతిపెద్ద స్టీల్‌ పరిశ్రమగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవతరించిందన్నారు. దీన్ని నిలబెట్టుకోడానికి భారీగా ప్రజా మద్దతు లభిస్తోందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ దేశంలో వాజ్‌పేయి తర్వాత అమ్మకాల ప్రధానమంత్రిగా మోదీ నిలుస్తార న్నారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేష్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి మరిన్ని ఉద్యమాలు చేయాలన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, ఏఐడీఎస్‌ఓ నాయకుడు హరీష్‌కుమార్‌, ఏఐపస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శ జాన్సన్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహనరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ జగ్గునాయుడు, విద్యార్థి నేతలు కుసుమ, చిన్నారి, ఎల్‌జే నాయుడు, ఫణీంద్ర, ఏఐవైఎఫ్‌ నేత భాషా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img