Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అమిత్‌షాతో జగన్‌ రహస్య ఒప్పందం

. రాహుల్‌ను వేధిస్తున్న మోదీ సర్కార్‌
. ఏప్రిల్‌ 14 నుంచి దేశ్‌ బచావో` మోదీ హఠావో
. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ

విశాలాంధ్రబ్యూరోతిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ‘దేశ్‌ కా బచావోమోదీ హఠావో’ నినాదంతో ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. తిరుపతి బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాహుల్‌గాంధీ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలిపారు. రాహుల్‌ను ప్రధాని మోదీ రాజకీయంగా హత్య చేశారని, ప్రజాకోర్టులో మోదీని దోషిగా నిలబెట్టి ప్రజలు ఘోరంగా ఓడిస్తారని పేర్కొన్నారు. వివేక హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే సమయంలో కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా కమిటీ వేయించి సీఎం జగన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని, జగన్‌ను అన్ని విధాలా వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. జగన్‌ పదేపదే దిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో బట్టబయలైందని, వివేకానందరెడ్డి హత్య కేసుతో భయపడి జగన్‌ దిల్లీ వెళ్లారని చెప్పారు. అమిత్‌ షాతో జగన్‌ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తప్పిస్తే…కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు గెలిపిస్తానని అమిత్‌ షాకు జగన్‌ హామీ ఇచ్చారని వెల్లడిరచారు. జగన్‌ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారన్నారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందం కారణంగా వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఎందుకివ్వడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నారాయణ ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యపై కేంద్రాన్ని జగన్‌ నిలదీయాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరంను సాధారణ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు.
బీజేపీపై రాజకీయ ఉద్యమం అవసరమని, అందుకే దేశ్‌ కా బచావో-మోదీ హఠావో నినాదంతో ప్రజాచైతన్య కార్యక్రమాలకు సిద్ధమవుతున్నామని నారాయణ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.జయలక్ష్మి, తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె.రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బి.నదియా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img