Friday, March 24, 2023
Friday, March 24, 2023

అమృతకాలంలో విషగుళిక

కార్పొరేట్లకు ఎర్రతివాచీ

. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలకు వరాలజల్లు
. ఎన్నికల్లేని ఇతర రాష్ట్రాలకు మొండిచెయ్యి
. వేతన జీవులకు ఊరట…ఆదాయపన్ను మినహాయింపు
. ధరల నియంత్రణకు మందుల్లేవ్‌
. వలసల నివారణకు చర్యల్లేవ్‌
. ఉపాధి హామీ నిధుల కుదింపు
. సబ్సిడీలన్నింటికీ దాదాపు 30% వరకూ కోత
. ఆహారభద్రతకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

భారతదేశ అమృతోత్సవ వేళ… చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేని మోదీ సర్కారు… ఏవో మందుగుళికలు వేసే క్రమంలో… కార్పొరేట్ల కండకావరం పెంచేందుకు సప్తరుషులు (సప్తసూత్రావళి పేరుతో) శోధించి, సాధించిన అమూల్య ఔషధ రసాలు అందిస్తూ… పేద, మధ్యతరగతిని మాత్రం విషగుళికలు మింగించే ప్రయత్నం చేస్తోంది. అమృతకాలంలో అద్భుత బడ్జెట్‌ అంటూ మోదీవర్గం ఎంత గొంతు చించుకున్నా… చివరకు మిగిలింది నిరాశాజనకమైన, అభివృద్ధి నిరోధకమైన బడ్జెట్టే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అర్థంకాని లెక్కలతో, అంకెలగారిడీతో జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేశారు. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ఎఫ్‌డీఐలకు, దేశీయ కార్పొరేట్లకు ఈ ఏడాదీ రెడ్‌కార్పెట్‌ వేశారు. ప్రభుత్వ రంగ పాత్ర పోషించలేని ప్రైవేటు రంగానికి ఇంకోసారి పచ్చజెండా ఊపారు. ఆర్థిక వ్యవస్థ మూలాలను విస్మరించారు, నేలవిడిచి సాముచేశారు. ఏడాదంతా రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా వినని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా కరుణ చూపిస్తుందని ఆశించినా ఫలితం దక్కలేదు. గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత బడ్జెట్‌ను తయారు చేసిన నిర్మలమ్మ ఈసారి కర్ణాటక ఎన్నికల కాంక్షతో ఆ రాష్ట్రాన్ని కేటాయింపులతో ముంచేశారు. తెలుగు రాష్ట్రాలు ఆమెకు కనుచూపు మేరలోనైనా కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌ కింద రూ.2.40 లక్షల కోట్లను కేటాయించారు. 9 రెట్లు పెంచామన్న అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి యత్నించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియను తీవ్రతరం చేశారు. బడ్జెట్‌ స్థాయిని ఐదారు లక్షల కోట్లు పెంచేసి, అదే అభివృద్ధి అన్ని రంగుపులిమారు. కొవిడ్‌ మహమ్మారి తర్వాత వచ్చిన తొలి బడ్జెట్‌ అని చెప్పుకున్నా… కొవిడ్‌ సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలను కాపాడుదామన్న ఇంగితజ్ఞానాన్ని ఏ మాత్రం ప్రదర్శించలేకపోయారు. వలసల నియంత్రణకు చర్యల్లేకుండా చేశారు. ఉపాధి హామీకి నిధులను కుదించేశారు. పెరిగిన ధరలను, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఒక్క ‘మాత్ర’నూ అందించలేకపోయారు. వచ్చే సంవత్సరమూ ధరల పెరుగుదలను నివారించగలమన్న హామీని ఇవ్వలేకపోయారు. ఆహార భద్రతకు భరోసా ఇవ్వలేకపోయారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్తావనే లేకుండా చేశారు. అన్నదాతపై మరోసారి అక్కసు ప్రదర్శించారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీకి ప్రతిపాదనలే లేవు. ఆత్మహత్యలపై స్పందన లేదు. ఎరువుల ధరలపై మాటాలేదు… మూటాలేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కేటాయింపులను రూ.89,000 నుంచి రూ.60,000కు తగ్గించారు. వ్యవసాయ కేటాయింపులను రూ.8,500కు కోతపెట్టారు. ఆవు పేడను తీసుకొచ్చి ఎరువుగా మార్చి తిరిగి రైతులకే ఇచ్చే ప్రత్యేక సేంద్రియ ప్రతిపాదనను తీసుకువచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు నిధులిచ్చారు. పల్లెలకు మాత్రం చేయిచ్చారు. పైగా తమకు సంబంధంలేని సహకార సంఘాల ఆన్‌లైన్‌కు నిధులిచ్చి వాటిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునే విషపూరిత ప్రతిపాదనను మోసుకొచ్చారు. దాదాపు సబ్సిడీలన్నింటికీ అటుఇటుగా 30 శాతం వరకూ కోత విధించారు. ఆహార సబ్సిడీని రూ.2.8 లక్షల కోట్ల నుంచి రూ.1.97 లక్షల కోట్లకు, ఐసీడీఎస్‌ కేటాయింపులను కుదించారు. చివరకు ఎంఎస్‌ఎంఈల క్యాపిటల్‌ సబ్సిడీపైనా అవాస్తవాలకు రంగులద్దారు. ఎనిమిదేళ్లలో చేసిన 147 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీల కింద రూ.10 లక్షల కోట్ల చెల్లింపులను గణాంకాల్లో చూపించారు. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ.41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు ఉన్నప్పటికీ, ఈ రెండు రాష్ట్రాలను దాదాపుగా బడ్జెట్‌లో విస్మరించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చడంలో ఏ మాత్రం ఆసక్తి చూపలేదు.
పోలవరం తదితర ప్రాజెక్టుల ఊసేలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.683 కోట్లు, సింగరేణికి రూ.1,650 కోట్లు విదిల్చారు. చిన్నాచితకా తప్ప ఇంకేమీ కన్పించలేదు. 35 శాతం యువ నిరుద్యోగంపై నోరుమెదపలేదు. అసమానతలపై అడ్రస్సేలేదు. టెక్నాలజీపై పెట్టుబడుల గురించి చెప్పినా, మానవ వనరులపై ఆశలు నీరుగార్చారు. డిజిటలైజేషన్‌ పేరుతో నాలుగు మాయమాటలు చెప్పి బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించారు. స్థూలంగా నిర్మలమ్మ బడ్జెట్‌ వెనుక కహానీ ఇదే..!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img