. ఎన్డీయే పాలనలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: ముప్పాళ్ల
. వివిధ ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం ప్రచార కార్యక్రమం
విశాలాంధ్ర నెట్‌వర్క్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతలా వ్యవహారిస్తున్నారనీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని యథేచ్ఛగా అమ్మివేస్తున్నారనీ, ఆయనను తక్షణం గద్దెదించాల్సిందేనని సీపీఐ, సీపీఎం నాయకులు వక్కాణించారు. లేకుంటే దేశ భవిష్యత్ ప్రశ్నార్థకమవు తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్, బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని తద్వారా ఉద్యోగ, ఉపాధిరంగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. ‘బీజేపీ హఠావో`దేశ్ బచావో’ నినాదంతో సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారభేరి కార్యక్రమం ఆదివారం మూడో రోజుకు చేరింది. సీపీఐ, సీపీఎం అధ్వర్యాన ప్రచార కార్యక్ర మంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో ఉభయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఇందిరా నగర్‌లో ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ మోదీ అవినీతి లేని పాలన అందిస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఖాతాలో జమ చేస్తానని, ధరలు తగ్గిస్తానని 2014లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. నేటికి 9 సంవత్సరాలైనా ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నరేంద్ర మోదీ దుర్మార్గపూరితమైన మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలని దేశ ప్రజలలో చైతన్యం కల్పించడానికి సీపీఐ, సీపీఎం ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న రాష్ట్ర ప్రభుత్వం మోదీ ఆదేశాలతో ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను వేసి ప్రజలపై భారాల మీద భారాలు మోపుతూ ముక్కుపుడక ఇచ్చి నక్లెస్ కాజేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్న ప్రజల పక్షాన నూరు శాతం నిలబడేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. దేశంలో పార్లమెంట్ వ్యవస్థ నిలబడాలన్నా… బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలు భవిష్యత్ తరాలకి అందించాలన్నా ఎర్రజెండా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. 5, 6, 7, 8 వార్డుల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు జాలాది జాన్ బాబు, కంచర్ల కాశయ్య, పట్టణ నాయకులు ఎస్.గణేష్, ఎస్.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారభేరి కార్యక్రమం మూడో రోజు ఆదివారం విజయవాడ కండ్రిక సెంటర్‌లో జరిగింది. గ్యాస్‌సిలిండర్ భారం మోయలేకపోతున్నామని వివరిస్తూ సిలిండర్‌ను నేలమీద తిరగేసి వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో జరిగిన సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోదీ మోసం చేశారని తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా తనకు ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్ ఆ తరువాత ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు జగన్ సింహంలా సింగిల్‌గా వస్తానని మోదీ బోనులో చిక్కుకుందని ఎద్దేవా చేశారు. ప్రచార భేరి కండ్రిక, ప్రకాశ్‌నగర్, విద్యాధరపురం, కబేళా సెంటర్‌లలో జరిగింది. కార్యక్రమంలో సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, సీపీఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాధ్‌తో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.