Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అమ్మ రాజీనామా

పార్టీ శ్రేణుల నిరుత్సాహం
షర్మిలకు అండగా నిలుస్తా
తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతు
విజయమ్మ భావోద్వేగం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. శుక్రవారం జరిగిన వైసీపీ తొలిరోజు ప్లీనరీ వేదికగా ఆమె ఈ ప్రకటన చేశారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. విజయమ్మ ఆ ప్రకటన చేసిన సమయంలో రాజీనామా వొద్దు..వొద్దు అంటూ నినదించారు. ఇక నుంచి తాను తెలంగాణలో షర్మిలకు అండగా నిలుస్తానని విజయమ్మ వెల్లడిరచారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని విజయమ్మ అన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలకు హాజరైన విజయమ్మ మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి అందరివాడనీ, అందరి హృదయాల్లో ఆయన సజీవంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌, తెలంగాణలో షర్మిల వేర్వేరుగా పార్టీలు పెట్టారని, ఇది ఊహించని విషయమేనన్నారు. తల్లిగా షర్మిలకు రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల మధ్య రాజకీయ విమర్శలకు ఎలాంటి తావులేకుండా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. నాడు అధికార శక్తులన్నీ విరుచుకుపడినప్పటికీ జగన్‌ బెదరలేదన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారనీ, 2011లో కాంగ్రెస్‌ పొమ్మనలేక పొగపెట్టిందని మండిపడ్డారు. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. ఉద్దండ నాయకులకే జగన్‌ గొంతు ఎండిపోయేలా చేశారన్నారు. ఇవాళ సగర్వంగా ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని, ప్రజలందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి తాను వచ్చానన్నారు. ప్రజాభిమానం, ఇచ్చిన మాట నుంచి వైసీపీ పుట్టిందని, ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారని, జగన్‌ చెప్పినవే కాకుండా, చెప్పనివీ చాలా చేశారని వివరించారు. జగన్‌ మాస్‌ లీడర్‌ అని, యువతకు రోల్‌మోడల్‌ అని పేర్కొన్నారు. ప్రజలందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. నాడు తన బిడ్డ జగన్‌ను నడిపించుకోమని మీకే అప్పజెప్పగా, అందుకు నడిపించిన అందరిపైనా అణువణువునా కృతజ్ఞత ఉందన్నారు. ప్రజల బిడ్డల్నీ జగన్‌ చేతుల్లో పెట్టాలనీ, వారికి ఉజ్వల భవిష్యత్‌ అందిస్తారని స్పష్టంచేశారు. ప్రజలతో తన అనుబంధం ఈనాటిది కాదనీ, 45 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలంటూ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్‌ బిడ్డగా షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టుకుందని, తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుందని వివరించారు. ప్రస్తుతం ఆమెకు తన అవసరముందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్‌ జగన్‌ ఇక్కడ అవసరమని, తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకున్నారని విశ్లేషించారు. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. వైఎస్సార్‌ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్‌ గెలుస్తారని విజయమ్మ చెప్పారు. తల్లిగా జగన్‌కు తనమద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తన ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రజలకు తన ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారనీ, వారికి మీ మద్దతు కావాలని కోరారు. విజయమ్మ ప్రసంగం అనంతరం వేదికపై ఉన్న జగన్‌ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img