Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

అలజడి

విశాఖ విమానాశ్రయంలో ఉద్రిక్తత
. మంత్రుల కార్లపై జనసేన దాడి
. పిడిగుద్దులు, రాళ్లు, కర్రలతో రచ్చ
. ధ్వంసమైన కార్ల అద్దాలు బ అనేకమందికి గాయాలు
. నిందితులపై కఠిన చర్యలు: కమిషనర్‌

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: అనుకున్నంతా జరిగింది. విశాఖలో వైసీపీ, జనసేన మధ్య శనివారం తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీ చేపట్టిన ఉత్తరాంధ్ర గర్జన అనంతరం తిరుగు ప్రయాణమైన మంత్రులు, జనవాణి కార్యక్రమంలో పాల్గొనందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖకు రావడంతో స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు ఒకేసారి విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా వైసీపీ మంత్రుల కార్లపై విరుచుకుపడ్డారు. విమానాశ్రయానికి వెళుతున్న మంత్రులు జోగి రమేశ్‌, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. జోగి రమేశ్‌, రోజా కార్ల అద్దాలు పగిలిపోయాయి. రోజా సహాయకుడి తలకు తీవ్ర గాయమైంది. ఊహించని ఈ పరిణామంతో వైసీపీ మంత్రులు, నేతలు బిత్తరపోయారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లు విసిరారు. విమానాశ్రయంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించినా, ఊహించని ఈ ఘటనతో వారు కూడా అవాక్కయ్యారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు లాఠీలకు పనిచెప్పారు. జనసేన అభిమానులను చెదరగొట్టారు. మంత్రుల వాహనాలకు అడ్డుగా నిలబడి విమానాశ్రయంలోకి పంపించారు. ఈ పరిణామాలపై విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ స్పందించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘ఉత్తరాంధ్ర’ మనోభావాలపై దాడి: అమర్‌నాథ్‌
ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు. ప్రజలకు ఆంక్షలు చెప్పిన తర్వాతే పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉద్యమంపై చర్చ పక్కదారి పట్టేలా జనసేన ఇలాంటి దాడులకు తెగబడుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై జరిగిన దాడి. విచక్షణారహితంగా దాడి చేసిన వారిని జనసైనికులనుకోవాలా? సైకోలు అనుకోవాలా? ఈ దాడిని ఖండిస్తున్నాం. తక్షణమే పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు, వైసీపీకి క్షమాపణలు చెప్పాలి. ఈ చర్యలు చూస్తుంటే ఇక్కడి ఉద్యమానికి తూట్లు పొడవటమే పవన్‌ లక్ష్యంగా కనబడుతోంది. అందుకే ఈ పర్యటన పెట్టుకున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన వచ్చిన తరువాతే దాడులు జరిగాయి. ఈ సైకో పనులేంటి? మంత్రులపై, నాయకులపై దాడులేంటి? వైసీపీ కార్యకర్తలు తలుచుకుంటే కనీసం ఒక్కనిమిషమైనా అక్కడ ఉండేవారా? మీ పార్టీకి సిద్ధాంతం, లక్ష్యం లేదు. ఏమీ లేకుండా పార్టీని నడిపితే ఇలాగే ఉంటుంది.
దృష్టి మళ్లించేందుకే నాటకాలు: నాదెండ్ల
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరం. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగానీ, అది జనసేన వాళ్లు చేసినట్లుగానీ పోలీసులు నిర్ధారించలేదు. ఈ ప్రకటనలన్నీ కేవలం వైసీపీ నాయకులు చేస్తున్నవే. దాడి సంస్కృతిని మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. ఆ విద్యలో వైసీపీ వాళ్లు ఆరితేరారు. ఇప్పటికే కోడి కత్తి హడావుడి చేశారు. ఆకేసు ఏమైందో ఇప్పటికీ తేలలేదు. మంత్రులపై, ఇతర నాయకులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యమే. ఆదివారం జరిగే జనవాణి కార్యక్రమం నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెరతీసింది. పవన్‌కు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశాం. విశాఖ సీపీకి మా పార్టీ నేతలు లేఖ ఇచ్చారు. అయినా తగిన విధంగా స్పందించలేదు. అంటే దీని వెనుక పెద్దల నుంచి ఒత్తిడి ఉందన్న విషయం అర్థమవుతోంది. పార్టీ శ్రేణులతో పవన్‌ ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా పవర్‌ కట్‌ చేశారంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img