Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అవినాశ్‌ మళ్లీ డుమ్మా

మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు
విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మాజీమంత్రి మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి శుక్రవారం కూడా సీబీఐ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకి ఆయన లేఖ రాశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చేందుకు ఎంపీ తరపు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాశ్‌ పేర్కొన్నారు. సీబీఐ విచారణకు అవినాశ్‌రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వరుసగా ఇది రెండోసారి. ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్‌ నుంచి కడప వెళ్లిపోయారు. దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం, అవినాశ్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్‌ అందజేశారు. తాజాగా విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న అవినాశ్‌…మళ్లీ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాస్తూ తన తల్లి అనారోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేనని పేర్కొన్నారు.
అనంతరం తిరిగి ఆయన పులివెందులకు వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి అవినాశ్‌రెడ్డి బయల్దేరారని, మార్గమధ్యలో తల్లి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరపు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు.
అవినాశ్‌ తల్లి గుండెపోటుతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో వెంటనే ఆయన పులివెందుల బయల్దేరినట్లు తెలిపారు. దీనిపై సీబీఐకి లిఖితపూర్వకంగా సమాచారం ఇస్తామని, వాళ్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలనేది తాము ఆలోచిస్తామన్నారు. తండ్రి భాస్కర్‌రెడ్ది జైల్లో ఉన్నందున తల్లిని అవినాశ్‌రెడ్డే చూసుకోవాల్సి ఉందని న్యాయవాది చెప్పారు.
అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన అవినాశ్‌ తల్లి
అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ శుక్రవారం మధ్యాహ్నం పులివెందులలోని ఇంటిలోనే అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అవినాశ్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులందరూ పులివెందులలో ఉన్న ఓ ప్రముఖ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేసి…వెంటనే కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.
దాంతో పులివెందుల నుండి అంబులెన్స్‌లో సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు గాయత్రి ఏస్టేట్‌లోని విశ్వభారతి సర్వజన వైద్యశాలలో చేర్పించారు. హాస్పిటల్‌ వైద్యులు చెప్పిన ప్రకారం అవినాశ్‌రెడ్డి తల్లికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పారు. ఆ తర్వాత తల్లిని చూడటానికి వచ్చిన అవినాశ్‌రెడ్డి కూడా ఛాతిలో నొప్పి అని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పుకార్లు వ్యాపించాయి. ఇక సీబీఐ అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, దానికనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img