Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

అవినాశ్‌ వెనుక అదృశ్య శక్తి !

వివేకా హత్య కేసు తేల్చలేని సీబీఐ
జర్నలిస్టులపై వైసీపీ దాడి దారుణం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-కర్నూలు సిటీ : నాలుగేళ్లు దాటినా మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ ఎందుకు తేల్చలేకపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి రాష్ట్ర, పోలీసులకు, సీబీఐకి సవాల్‌ విసురుతున్నారని చెప్పారు. అవినాశ్‌రెడ్డి వెనుక ఏదో అదృశ్య శక్తి పనిచేస్తోందని రామకృష్ణ విమర్శించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు సీపీఐ కార్యాలయంలో రామకృష్ణ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినాశ్‌రెడ్డి కడప పోలీసులతో పాటు తన అనుచరులు, కార్యకర్తలతో కర్నూలులో మకాం వేసి…స్థానిక పోలీసులకు, సీబీఐకి సవాల్‌ విసిరారని రామకృష్ణ చెప్పారు. వార్త సేకరణ కోసం వచ్చిన జర్నలిస్టులపై వైసీపీ గూండాలు దాడి చేసినా…కడప పోలీసులకు, అవినాశ్‌ అనుచరులకు కర్నూలు పోలీసులు కాపలా కాస్తున్నారని విమర్శించారు. కర్నూలు జర్నలిస్టులను కడప, పులివెందుల నుంచి వచ్చిన గుండాలు సమీప హోటల్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం దారుణమన్నారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాల నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అవినాశ్‌రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పిన కర్నూలు పట్టణ సీఐపై వైసీపీ రౌడీలు మాటలదాడికి దిగారన్నారు. సీఐకే రక్షణ లేకపోతే సామాన్యుల గతేమిటని రామకృష్ణ ప్రశ్నించారు. సీబీఐ అధికారులు కర్నూలులో హడావిడి చేసి జిల్లా ఎస్పీ అతిథి గృహానికి పరిమితం కావడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులు చేయడం, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ విశ్వసనీయతను కోల్పోతోందన్నారు. వివేకా హంతకులెవరో తెలుసుకునేందుకు నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తూనే ఉందని, ఆయనను చంపిన ముద్దాయిలెవరో కడప, పులివెందులలో స్కూల్‌ పిల్లలను అడిగినా చెబుతారన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేశామని చెబుతున్న నరేంద్ర మోదీ…రాష్ట్రపతిని పార్లమెంటు భవనం ప్రారంభం చేయకుండా అడ్డుకొని అవమానిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి గౌరవాన్ని కాపాడుకునేందుకు 21 పార్టీలు పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయన్నారు.
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తి, మిరప, పొగాకు, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతులు ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం అందించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు ఆసరాగా ఉండటం లేదన్నారు. మార్కెట్‌లో విచ్చలవిడిగా వస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని, రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ చేసి పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు అందజేయాలన్నారు. బ్యాంకుల్లో పాత అప్పులు చూపించి రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేదని, అప్పుతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రుణాలు ఇవ్వాలన్నారు. విత్తనాలను 90 శాతం సబ్సిడీతో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాలన్నారు. రైతుసమస్యలపై చర్చించేందుకు జూన్‌ 13, 14,15 తేదీల్లో నరసరావుపేటలో రాష్ట్రస్థాయి వర్క్‌షాపు జరుగుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్‌ రసూల్‌, మునెప్ప, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img