Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

అవినీతిపరులకు మోదీ అండ

. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న జగన్‌
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర`ఒంగోలు: అవినీతిపరులకు కొండంత అండగా నిలిచిన ప్రధాని మోదీ…ప్రతిపక్ష పార్టీలు అవినీతిమయమంటూ ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 మంది బ్యాంకుల నుండి ప్రజాధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. అందులో ఒక్క విజయ్‌ మాల్యా తప్ప అందరూ గుజరాతీయులేనని చెప్పారు. వారంతా ప్రధానికి దగ్గరి వారేనన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ, ఈడీ, కేంద్ర బలగాలు ఏ ఒక్కరినీ విదేశాలకు పారిపోకుండా ఆపలేకపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అటువంటి ప్రధాని ప్రతిపక్ష పార్టీలను అవినీతిమయమని పేర్కొవటం దెయ్యాలు వేదాలు వల్లించిన తీరుగా ఉందని విమర్శించారు. అదానీ కుంభకోణాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోందన్నారు. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద కుంభకోణమన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి మోదీతోనే అదానీ ఉన్నారన్నారు. మోదీని ప్రధానిని చేయడం కోసం అదానీ దేశమంతా తిరిగి డబ్బు విపరీతంగా ఖర్చు చేశారన్నారు. చివరికి మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ సంపదనంతా కొల్లగొడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ డొల్ల కంపెనీల బాగోతం బయపడిరదన్నారు. లక్షల కోట్లు ఎలా కొల్లగొట్టారో, ప్రభుత్వ రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారో, ప్రధాని పేరును వినియోగించుకొని ప్రజాధనాన్ని ఎలా లూటీ చేశారో బహిర్గతమైందన్నారు. అదానీ కుంభకోణంపై పార్లమెంటును స్తంభింప చేసినా జేపీసీని ఎందుకు వేయటం లేదో ప్రధాని చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే మోదీ లక్ష్యంగా మారిందన్నారు. తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో మోదీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలకు నిరసనగా ఏప్రిల్‌ 14 నుండి వామపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమం చేపట్టాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ స్వప్రయోజనాల కోసం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నా ప్రశ్నించకుండా వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి, అతని తండ్రి భాస్కర్‌రెడ్డిలను కాపాడేందుకు జగన్‌ నానాతంటాలు పడుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుపై మోదీ సర్కారు రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ.1429 కోట్లు మాత్రమే నిధులు ఇస్తామని పేర్కొనటం దుర్మార్గమన్నారు. ఎటువంటి అనుమతులు లేని కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ లబ్ధికోసమేనని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సీఎం జగన్‌ను హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.వెంకట్రావు, డి.శ్రీనివాస్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.వీరారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img