. ప్రజలకు, రైతులకు భారీ నష్టం
. ఉదారంగా సాయం చేయడం అవసరం
. కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదలతో ఊహించని విపత్తు తలెత్తి రాష్ట్రానికి అపార నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ఉదారత చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర బృందంతో సీఎం గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ‘ఇది అసాధారణ విపత్తు, రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలి’ అని బృంద సభ్యులతో ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని, పంటలు నీట మునిగి రైతులు కుదేలయ్యారన్నారు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు క్షోభను అనుభవించారని చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం ఉండేలా చూడలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. రెండు రోజులలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, కృష్ణా బ్యారేజి చరిత్రలో ఇంత వరద రాలేదని చెప్పారు. గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజిని నిర్మించారని, ఇటీవల వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణా నదికి 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఏమి చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయామని చెప్పారు. మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేశారన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి కలెక్టరేట్‌ను సచివాలయంలా మార్చుకొని పనిచేశామని చెప్పారు. సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దించి ప్రజలకు నమ్మకం కల్పించామని తెలిపారు. అప్పటికప్పుడు డ్రోన్లు తెప్పించి ఆహారం సరఫరా చేశామని, సహాయక చర్యల కోసం కేంద్ర సాయం తీసుకున్నామని, ఫైరింజన్లు పెట్టి రోడ్లు, ఇళ్లు శుభ్రం చేశామని సీఎం వివరించారు. తన స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు సహాయక చర్యలలో నిమగ్నమైనట్లు తెలిపారు. సహాయక చర్యలను ఒక యుద్ధంలా చేశామని సీఎం చెప్పారు. నష్టపోయిన కౌలురైతులకు సాయం అందేలా చూడాలన్నారు. రోడ్లు, ఇరిగేషన్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజి ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరని చెప్పారు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడవద్దు అని కోరుతున్నానని కేంద్ర బృందానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
సహాయక చర్యలు భేష్ : అనిల్ సుబ్రహ్మణ్యం
వరద ప్రాంతాల్లో పర్యటన అనుభవాలను ముఖ్యమంత్రికి కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంత కష్టంలోనూ ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహం కనిపించలేదన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, సాయం చేస్తుంది అనే నమ్మకం వారిలో ఉందని తెలిపారు.
డ్రోన్ల వంటి వాటి ద్వారా ప్రభుత్వ సహాయక చర్యలు వినూత్నంగా సాగాయని అభినందించారు. ‘60 ఏళ్ల తరువాత ఇలాంటి వరదలు వచ్చాయని ప్రజలు చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కోరారు’ అని సుబ్రహ్మణ్యం అన్నారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.