. ‘ముందస్తు’కే వైసీపీ మొగ్గు
. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశం
. సీఎం వరుస దిల్లీ పర్యటనలపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఈసారి గడువు ప్రకారం నవంబరులో జరగనున్నాయి. దాంతోపాటే ఏపీలో సైతం ఎన్నికలు నిర్వహించేందుకు అసెంబ్లీని ఏప్రిల్ లేదా మే నెలలో రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఇటీవల వరుస దిల్లీ పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సైతం పక్కనపెట్టి దిల్లీకి అర్థాంతరంగా వెళ్లిన ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. మీడియాకు మాత్రం విభజన అంశాలపై వారికి వినతిపత్రం ఇచ్చినట్లు ప్రకటన విడుదల చేశారు. దీనికోసమైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సీఎం దిల్లీ వెళ్లినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈ పర్యటనపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, వారం రోజుల వ్యవధిలోనే బుధవారం విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు వెళ్లినట్లే వెళ్లి అక్కడనుంచి సీఎం జగన్ దిల్లీకి బయలుదేరి వెళ్లడం రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు తెరతీసింది. దీనికి ముందుగా రాష్ట్ర గవర్నర్‌ను కలవడం, ఆ తర్వాత వెంటనే దిల్లీ బయలు దేరి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల్లో భాగంగానే సీఎం దిల్లీ వరుస పర్యటనలు జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. సీఎం జగన్ పదేపదే ఎందుకు దిల్లీకి వెళ్తున్నారు? రాష్ట్రాభివృద్ది కోసమా? లేక తన సొంత పనుల కోసమా? అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నలను సంధిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రధానమంత్రిని పది రోజుల వ్యవధిలో రెండు సార్లు కలిసే అవకాశం రావడం సాధ్యం కాదు. అటువంటిది ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఎందుకు ప్రధానిని, హోంమంత్రిని కలవడానికి వెళ్లాల్సి వచ్చిందో వెల్లడిరచాలని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. సీఎం దిల్లీ పర్యటనలపై ప్రభుత్వం నమ్మశక్యం కాని సమాధానాలు చెపుతుండడంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. వివేకా కేసులో సీబీఐ అధికారిని మార్చడం, సత్వర విచారణ పేరుతో కొత్తగా విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం, మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వంటి పరిణామాలన్నీ జగన్ పర్యటనతో ముడిపడి ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ ఇవ్వలేని దయనీయ పరిస్థితులు నెలకొనడం, ఇంకోవైపు ఉద్యోగులతో సహా, అన్ని వర్గాలు ఉద్యమాల బాట పట్టడం, అన్నింటికి మించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటలకు వారాహి వాహనాన్ని సిద్ధం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే శ్రేయస్కరంగా భావిస్తున్నట్లు అధికారపార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. గడువు ప్రకారం 2024వరకు ఆగితే ప్రభుత్వ మనుగడ కష్టమేనని వారే అంగీకరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అయ్యేలోపే అసెంబ్లీ రద్దు చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా వైసీపీ నేతలు యోచిస్తున్నారు. అలాగే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఏపీ శాసనసభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండ ఉంటుందని భావిస్తున్నారు. అదే గడువు ప్రకారం పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎన్నికలకు వెళితే ఆ అవకాశం పోతుందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు.
హోంమంత్రి అమిత్‌షాతో భేటీ
బుధవారం దిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ నేత మిథున్ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, రెడ్డప్ప, తలారి రంగయ్య, గురుమూర్తి, ఆదాల ప్రభాకర రెడ్డి, మాధవి, అనురాధ, సత్యవతి, అయోధ్య రామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, బీద మస్తాన్‌రావు, కోటగిరి శ్రీధర్ తదితరులు స్వాగతం పలికారు. రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. రాత్రికి కలిసే అవకాశం లేని పక్షంలో దిల్లీలోనే బస చేసి గురువారం ప్రధానిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి ఎంపీ అవినాశ్‌రెడ్డి కేసు, ముందస్తు ఎన్నికల వ్యవహారమే సీఎం వరుస దిల్లీ పర్యటనలకు కారణమనే ప్రచారం మాత్రం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.