సంచలన తీర్పు వెలువరించిన ప్రత్యేక కోర్టు
గుజరాత్ అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ పేలుళ్ల కేసుల్లో నిందితులైన మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఒక్క పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష విధించడం మొట్టమొదటిసారి. గుజరాత్ సీరియల్ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం రేపింది.2008లో అహ్మదాబాద్ లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది.వారిలో 38 మంది కీలక దోషులుగా ప్రకటించిన ప్రత్యేక ధర్మాసనం.. వారికి మరణ శిక్ష విధించింది. అంతేకాకుండా మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వరుస బాంబు పేలుళ్ల ఘటనపై సుధీర్ఘంగా విచారించిన ప్రత్యేక కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. 48 మంది దోషులకు ఒక్కొక్కరికి రూ.2.85 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఆయుధాల చట్టం కింద దోషిగా తేలి, మరణశిక్ష పడిన వారిలో ఉన్న ఉస్మాన్ అగర్బత్తివాలాకు అదనంగా ఆయుధాల చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.