Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఆక్వాకు మహర్దశ

దళారుల దోపిడీకి చెక్‌ పెడతాం
జనవరి 26కల్లా 80 హబ్‌లు, 14 వేల రిటైల్‌ అవుట్‌లెట్లు
వచ్చే డిసెంబరుకి 10 ప్రాసెసింగ్‌, 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు
మత్స్య ఉత్పత్తుల పెంపకం, ఎగుమతులపై రైతులకు శిక్షణ
సహకార డెయిరీ వ్యవస్థను బలోపేతం చేస్తాం : సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ఆక్వా రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని, దళారుల దోపిడీకి చెక్‌ పెట్టి రైతాంగానికి మేలు చేసేందుకు భారీస్థాయిలో ఆక్వా హబ్‌లు, రిటైల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. మత్స్యశాఖ, జగనన్న పాల వెల్లువపై మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్‌, సీడ్‌లో నాణ్యత, రైతులను దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా తెచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేటై రేట్లు తగ్గించి రైతులను దోపిడీ చేస్తున్నారు. ప్రాసెసింగ్‌, ఎగుమతి చేసేవాళ్లు సిండికేట్‌ అవుతున్నారని రైతులు తరచూ ఆరోపిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా, స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వా హబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకువస్తున్నామని సీఎం అన్నారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్‌, ప్రాసెసింగ్‌, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందన్నారు. జనవరి 26 నాటికి దాదాపు 75-80 హబ్‌లను, 14 వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీనివల్ల దాదాపు 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి 10 ప్రాసెసింగ్‌, 23 ఫ్రీి ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎగుమ తులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై రైతులకు ఇప్పటి నుంచే అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం విడుదల చేశారు. జగనన్న అమూల్‌ పాల వెల్లువపై సమీక్షిస్తూ మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడి పశువులను కొనుగోలు చేశారు. వీరికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీ యూలను నిర్మిస్తున్నాం. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని సీఎం వెల్లడిరచారు. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, వాటిని తమ ప్రైవేటు సంస్థలుగా మార్చు కున్నారని విమర్శించారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని, అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని సీఎం వివరించారు. అమూల్‌ రాకతో లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం వచ్చిందని, ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ – శిక్షణా కరదీపిక పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img