Monday, March 27, 2023
Monday, March 27, 2023

ఆగని ఆర్జేడీ ఆగడాలు

. ఈసీ ఆదేశించినా చర్యలేవి?
. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా భేటీలు
. పశ్చిమ రాయలసీమలో విస్తృతంగా సమావేశాలు
. విద్యాశాఖ కమిషనర్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : విద్యాశాఖ కడప ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఆగడాలు క్రమేపీ మితిమీరిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బరితెగించి, తాను ఓ అధికారిని అనే విషయాన్ని మరించి… ఏకంగా రాజకీయ నేతలాగా ఆయన మారిపోయారు. ఇప్పటికే ఎద్దఎత్తున ఆర్జేడీపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లినా చర్యలు చేపట్టలేదు. ఆర్జేడీ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులూ చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో ఆర్జేడీ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ… వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలు, సమావేశాలు, భేటీలు నిర్వహిస్తున్నప్పటికీ… ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మిగిలిన సమయాల్లో చిన్నపాటి తప్పిదానికి సైతం విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయడం, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న సంఘటనలున్నాయి. ఇటీవల కాలంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌… పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ చిన్నపాటి తప్పిదాలకు సైతం ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటున్న సంఘటనలున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆర్జేడీ కార్యకలాపాలు కొనసాగుతుంటే సదరు ఉన్నతాధికారి మాత్రం స్పందించడం లేదు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతలను మొత్తం ఆర్జేడీనే తనపైనే వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాగైనా వైసీపీ అభ్యర్థి గెలిపించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే… విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ ఎస్‌సీఈఆర్‌ సంచాలకులుగా పని చేస్తున్న ప్రతాప్‌రెడ్డిని కడప ఆర్జేడీగా ప్రభుత్వం బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. స్థానికుడైన ప్రతాప్‌రెడ్డిని అక్కడకు బదిలీ చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి చాలా ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకు చర్యల్లేవు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలంటూ కడప జిల్లా కలెక్టరు జారీజేసిన ఆదేశాలను సైతం ఆర్జేడీ ధిక్కరించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ తదితర విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
కర్నూలులో ఆర్జేడీకి నిరసన సెగ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం పేరుతో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిని ఏఐఎస్‌ఎఫ్‌ అడ్డుకుంది. అయితే పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు నెలరోజుల నుంచి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఆర్జేడీ సుడిగాలిలా పర్యటిస్తూ ఉపాధ్యాయ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. బహిరంగంగా సమావేశాల్లో పాల్గొంటూ… వైసీపీ అభ్యర్థి గెలిపించాలని ఆదేశాలిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రతాప్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ ముకేష్‌కుమార్‌ మీనా… అధికారులకు ఆదేశాలు జారీజేసినా ఫలితం లేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల అండదండలతోనే ఆర్జేడీ బహిరంగంగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం పని చేస్తున్నారనేదీ స్పష్టమవుతోంది.
ఆర్జేడీని సస్పెండ్‌ చేయాలి : విద్యాశాఖ కమిషనర్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ వినతి
పశ్చిమ రాయలసీమలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాశాఖ ఆర్జేడీ ప్రతాపరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పని చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌బాబు అధ్వర్యంలో విజయవాడ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. జాన్సన్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రైవేట్‌ టీచర్ల అసోసియేషన్‌ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించి, వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. నెల రోజుల ముందు ఏపీ ఎస్‌సీఈఆర్‌ డైరెక్టర్‌గా ఉన్న ప్రతాప్‌రెడ్డిని హుటాహుటిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందే కడప ఆర్జేడీగా ఎందుకు నియమించారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సురేష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందించి ఆర్జేడీపై సమగ్ర విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్‌ జీ, విజయవాడ నగర కార్యదర్శి సాయి కుమార్‌, అయ్యప్ప, యశ్వంత్‌, నవీన్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img