Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఆగని హిందూత్వ మూకల కవ్వింపులు

ఉత్సవ ఊరేగింపు నెపంతో హింసాకాండ

న్యూదిల్లీ : మత హింసకు భారతదేశానికి పెద్ద చరిత్ర ఉంది. ఇది 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రారంభమైంది. అన్ని మతపరమైన అల్లర్లకు హిందూ-ముస్లిం వివాదం ఎల్లప్పుడూ కేంద్రంగా ఉంది. మతపరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఘర్షణలు, అల్లర్లకు దారితీస్తున్న అంశం ఒక్కటే… ఉత్సవ ఊరేగింపుల ముసుగులో హింసాకాండ జరుగుతూనే ఉంది. ఊరేగింపులు సాగే మార్గాలను నిర్వాహకులు ఎంపిక చేసుకొనేదాంట్లోనే అల్లర్లకు దారితీసే… నివారించే అంశం దాగివుంది. ఈ విషయాన్ని 1860లోనే గుర్తించారు. థామస్‌ మకౌలే ఐపీసీ అమల్లోకి వచ్చింది. సెక్షన్‌ 153 కింద అల్లర్లు రెచ్చగొడితే ఆరు నెలలు, అల్లర్లకు పాల్పడితే ఏడాది శిక్ష పడుతుంది. సెక్షన్‌ 188…ప్రభుత్వ అధికారి ఉత్తర్వులను ఉల్లంఘించిన నేరం కింద చర్యలకు అవకాశం కలుగుతుంది.
1984లో ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కు సమాజం దురాగతాలకు గురైంది. 2002లో గుజరాత్‌ అల్లర్లతో ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. 2015లో మొత్తం 884 అల్లర్లు నమోదయ్యాయి, ఆ తర్వాత సంవత్సరంలోనూ హింస పేట్రేగింది. ఈ రెండేళ్లలో వరుసగా 2,428, 2,295 కుల ఘర్షణలు జరిగాయి. 2020లో 167 మత అల్లర్లు, 736 కుల ఘర్షణలు నమోదయ్యాయి. గోరక్షకుల దాడులు, మూకహత్యలు పేట్రేగిపోయాయి. ఈమధ్య లవ్‌జిహాద్‌ హింస పెరిగింది. అయితే మతపరమైన హింసను కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం కావడానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఇటు ఆన్‌లైన్‌లో, అటు వీధుల్లో కొన్ని మూకలు విజృంభిస్తున్నాయి. గణపతి నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో మహారాష్ట్రలో 1927లో, 1966లో ఘర్షణలు జరిగాయి. 1925లోనూ ఇలాంటి అలర్లు జరిగాయి. 1967లో మహారాష్ట్రలోని షోలాపూర్‌ నగరంలో హింస జరిగింది.
75 ఏళ్లుగా దేశంలో చెలరేగిన విధ్వంసకర మత హింసలో కొన్ని ప్రస్తావనార్హం.
1970లో భివండి, జలగావ్‌, మహడ్‌లో హింసకు దారితీసిన మతఘర్షణలు విషాదాన్ని మిగిల్చాయి. భివండిలో 78 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 59 మంది ముస్లింలు ఉన్నారు. జలగావ్‌, మహద్‌ నగరాల్లోనూ అదే తరహా హింస చోటుచోకోగా 43 మంది చనిపోయారు. వీరంతా ముస్లింలే కావడం గమనార్హం. 1963 వత్సరం భివండి చరిత్రలో కీలకం. అదే ఏట ఊరేగింపుల పరంపర మొదలైంది. మసీదుల మీదుగా సాగే సమయంలో ఘర్షణలు జరిగాయి. 1964లో శివజయంతి ఊరేగింపులో భాగంగా మసీదుల ఎదుట ఆగి ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వారిని రెచ్చగొట్టడం, గులాబీ రంగు చల్లడం వంటివి చేసేవారు. ఈ మేరకు జస్టిస్‌ మాడన్‌ గమనానికి వచ్చింది. ఇదే సంవత్సరంలో భారతీయ జనసంఫ్‌ు… బీజేపీ మాతృసంస్థ భివండి శాఖ మొదలుపెట్టింది. 1965లో ఊరేగింపుల ద్వారా కవ్వింపులు ఎక్కువయ్యాయి. 1967లో భివండి మొదటి మతఘర్షణ జరిగింది. శివజయంతి ఊరేగింపు నిజాంపురా జుమ్మా మసీదు మీదగా సాగే సమయంలో జరిగిన పరిణామాలు అలర్లకు దారితీశాయి. 1969లో శివజయంతి ఉత్సవ్‌ సమితి నిర్వీర్యమైంది. 15 మంది జనసేన సభ్యులతో పాటు ఓ శివసేన సభ్యుడు బయటకు వెళ్లడంతో ఈ సంస్థ ఆగిపోయింది.
1979లో జంషెడ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌/వీహెచ్‌పీ ఒత్తిడి మేరకు కొత్త మార్గంలో అంటే ముస్లింల ప్రాంతమైన సబీర్‌నగర్‌ మీదుగా రామనవమి ఊరేగింపు తీయాలని నిర్ణయించారు. అల్లర్లు జరుగుతాయని మార్గాన్ని మార్చుకోవాలని అధికారులు కోరినా నిర్వహకులు ససేమిరా అన్నారు. అయితే అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌/వీహెచ్‌పీ ఆందోళనకు దిగి చివరకు యంత్రాంగంపై ఒత్తిడి పెంచేందుకు ఆ ఏడాది మొత్తం ఊరేగింపు నిర్వహించలేదు. అలాంటి సమయంలో కర్పురి ఠాకూర్‌ నేతృత్వ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుతో రామనవమి ఊరేగింపును సబిర్‌నగర్‌ గుండా సాగేందుకు అనుమతి లభించింది. చిన్న/నమూనా ఊరేగింపు మాత్రమే అటుగా వెళుతుందని, అందులో స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొంటారని, సామన్య మార్గాల్లోనే ప్రధాన ఊరేగింపు సాగాలన్న ఒప్పందం మీద అనుమతి లభించింది. కానీ 15వేల మందితో కూడిన ప్రధాన ఊరేగింపు ఒక్కసారిగా మార్గాన్ని మార్చేసి ‘నమూనా’ ఊరేగింపును అనుసరించి సబిర్‌నగర్‌ మసీదు వద్ద బీజేపీ ఎమ్మెల్యే దీనానాథ్‌ పాండే ఆధ్వర్యంలో ముస్లిం వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు పేగ్రేటిపోయి అల్లర్లు చెలరేగాయి. 108 మంది చనిపోగా ఇందులో 79 మంది ముస్లింలు, 25 మంది హిందువులు ఉన్నారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం కూడా జరిగింది. సబిర్‌నగర్‌ అల్లర్ల కేంద్రంగా మారి అక్కడి ముస్లింలు తమ జీవితాలను, జీవనోపాధిని కోల్పోయారు.
1989 కోటాలో…1947 నుంచి ఎన్నడూ అల్లర్లను చూడని రాజస్తానీ నగరం కోటా. అక్కడ 1989లో లక్షిత అల్లర్లు`హింస చెలరేగింది. రాజస్తాన్‌లోని ఈ ప్రాంతంలో అనంత్‌ చతుర్దశి ఊరేగింపు నిర్వహించారు. గణపతి విసర్జనాన్ని వాడుకొని మతచిచ్చు రగిల్చారు. 1989, సెప్టెంబరు 15న ముస్లిం మొహల్లా గుండా ఊరేగింపు తీసి అక్కడి పెద్ద మసీదు ఎదుట ఆగి పెద్దపెట్టున మతపరమైన నినాదాలు చేయడమే కాకుండా ముస్లింలను దూషించారు. దీంతో అక్కడి ముస్లింలు ప్రతిఘటించారు. ఫలితంగా రాళ్లదాడులు, మారణహోమం జరిగింది. 20 మంది మృతి చెందగా అందులో 16 మంది ముస్లింలు ఉన్నారు. వేలాది మంది ముస్లిం వీధివిక్రేతలు, వర్తకులు పూర్తిగా నష్టపోయారు. ముస్లింల ఇళ్లు, దుకాణాలను హిందూత్వ మూకలు దగ్ధం చేశాయి.
1989, భాగల్పూర్‌లో.. ఆ ఏడాది అక్టోబరు 24న స్థానిక ముస్లింలు ఎక్కువగా ఉండే తాతర్‌పూర్‌లో రాముడి శిలను ఊరేగించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అక్కడ రామాలయం నిర్మాణంలో దీనిని వినియోగిస్తారని అప్పట్లో ప్రచారం ఉంది. (1992లో బాబ్రీ మసీదు విధ్వంసకాండ చోటుచేసుకుంది) వేలాది మందితో ఊరేగింపుకు పోలీసులు అనుమతిచ్చారు. తాతర్‌పూర్‌లోకి ఊరేగింపు ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలతో నిరాయుధ ముస్లింలు బిత్తరపోయారు. అక్కడ ఊచకోత పరిణమించింది. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో చేతులకు బేడీలతో 900 శవాలు దీనస్థితిలో లభ్యమయ్యాయి. ఏడాదికిపైగా ఈ అల్లర్లకు వ్యూహరచన జరిగినట్లు దర్యాప్తు కమిషన్‌ తేల్చింది.
2022లో జరిగిన హనుమాన్‌ జయంతి ఊరేగింపుల్లో మారణాయుధాలు, కర్ణభేరి పగిలేంత డీజే సౌండ్ల హోరు, మసీదుల వద్ద విద్వేష సాహిత్యం, రెచ్చగొట్టే చర్యలు, కవ్వింపులకు ముస్లింలు స్పందించగా అది అలర్లకు దారితీసింది. ఏదిఏమైనా ఇన్నేళ్లలో వచ్చిన మార్పు ఒక్కటే.. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు, పాలకులు చింతన వ్యక్తంచేసేవారు. దర్యాప్తు కమిషన్లు ఏర్పాటు చేసేవారు, బాధితులకు పరిహారం ఇచ్చేవారు కాని నేటి పాలకులు హింసను సమర్థిస్తున్నారు. మూకలను వెనకేసుకొస్తున్నారు. దర్యాప్తు కమిషన్లకు బదులు బుల్డోజర్లతో విధ్వంసానికి ఆదేశాలిస్తున్నారు. నిస్సహాయ మైనారిటీ వర్గంపై అధికార దమనకాండకు పోలీసులు మధ్యవర్తులయ్యారు. ప్రజా రక్షణ తమ విధిధర్మమని మర్చి పాలకులకు దాసోహమై అక్రమ నిర్మాణాలంటూ మైనారిటీలపై అధికారుల దురాగతాలను కప్పిపుచ్చడానికి పరిమితమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img