Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఆదాయం పెరిగేదెలా ?

కొత్తమార్గాలు అన్వేషించండి

జీఎస్టీ వసూళ్లు, పాత బకాయిలపై దృష్టి
సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లపై ఆగ్రహం
అక్రమ మద్యం రవాణా, కల్తీలపై ఉక్కుపాదం
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట : సీఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి : రాష్ట్రంలో ఆదాయ వనరుల పెంపునకు కొత్త మార్గాలు అన్వేషించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌, జీఎస్టీ, ఎక్సైజ్‌ శాఖలపై గురువారం సమీక్షించారు. ఆదాయ వనరుల పెంపుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, దానికనుగుణంగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రెవెన్యూ వసూళ్లపైనా కలెక్టర్లు, జేసీలు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితు లను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యేటా సహజంగా వచ్చే ఆదాయ వనరులు పెరిగేలా చూడాలని, జీఎస్టీ వసూళ్ల ద్వారా ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెంచుకునేందుకు వినూత్న సంస్కరణలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. మున్సిపల్‌, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతోపాటు ఆదాయాలు పెరుగుతాయన్నారు. మరోపక్క ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాదా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను నిలదీశారు? తప్పులకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌చేశామని అధికారులు తెలియజేయగా, ఈ స్థాయిలో తప్పులు జరుగు తుంటే, మన దృష్టికి ఎందుకు రావడం లేదు. ఎప్పటినుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి? క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా? లేవా? ఎందుకు చూడటం లేదని సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలని, అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్‌నంబర్‌ ఉంచాలని, కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టిపెట్టాలని మార్గనిర్దేశనం చేశారు. అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్‌ఓపీలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాకుండా అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని, కనీసం వారం, పదిరోజులకు ఒకసారైనా అధికారులు సమావేశం కావాలని సీఎం సూచించారు. కల్తీ మద్యంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి పెద్దఎత్తున వస్తున్న లిక్కర్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ప్రణాళిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ టాక్స్‌ పీయూష్‌కుమార్‌, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ ఐజీ ఎంవీ శేషగిరిబాబు, ఎస్‌ఈబీ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img