Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ రద్దు..వారంలోగా లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అతడు వారం రోజుల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. అసంబద్ధ కారణాలతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని, అవసరమైన అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఇవాళ సుప్రీం తన తీర్పులో పేర్కొన్నది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన సుప్రీం.. వారం రోజుల్లోగా ఆశిష్‌ మిశ్రా సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టును సుప్రీం కోరింది. బాధిత కుటుంబాల అభిప్రాయాల్ని హైకోర్టు సరిగా వినలేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. సుప్రీం బెంచ్‌లో జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్రాకు చెందిన కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img