Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఆహార భద్రత కరువు

పేదలకు అందని రేషన్‌ కార్డులు
లభించని ఆహార ధాన్యాలు`తప్పని పస్తులు
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధి పెంపుపై సర్కార్‌ నిర్లక్ష్యం
జనగణనను పట్టించుకోని వైనం

న్యూదిల్లీ : దేశంలో ఆహార భద్రత లోపించింది. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ ద్వారా రేషన్‌ అందడం లేదు. రేషన్‌ కార్డులు లేక ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా పొందలేక పేదలు ముఖ్యంగా వలస కార్మిక కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుండటం బాధాకరం. ప్రభుత్వం జనగణనను పరిగణించకుండా 2011 నాటి జనాభా లెక్కల ప్రాతిపదికన రేషన్‌ కార్డులు జారీ చేయడంతో కోట్లాది మంది సబ్సిడీ ధరలకు రేషన్‌కు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో రేషన్‌ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. పెద్ద సంఖ్యాక జనాభా ఆహార హక్కుకు నోచుకోవడం లేదు. ఆర్థిక స్థితిని సూచిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీకి ఆహార ధాన్యాలను పొందేందుకు వీలు కల్పించే అధికార పత్రమే రేషన్‌ కార్డు. దీని కోసం దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా… చెప్పులరిగేలా అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం ఉండటం లేదు.
దక్షిణ దిల్లీలోని మురికివాడలే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను రేషన్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు దిరిగిరాని ధరలు… సబ్సిడీ రేట్లకు ప్రభుత్వం ద్వారా రేషన్‌ లభించక పేదలు ఇబ్బంది పడుతున్నారు. రెండు పూట్ల భోజనం చేసే పరిస్థితులు లేక ఓ పూట తిని మరో పూట పస్తులు ఉంటున్నారు. కోవిడ్‌ వల్ల వారి కష్టాలు వర్ణణాతీతమయ్యాయి. ఉపాధి ఆదాయం లేక కుటుంబ పోషణ భారమై దినదిన గండంగా బతుకు ఈడ్చారు. కార్డులు లేక ప్రభుత్వమిచ్చే రేషన్‌ పొందలేక వలస కార్మిక కుటుంబాలు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టినా స్పందన కరవవుతోందని కార్మికులు వాపోయారు. దేశ రాజధాని దిల్లీలోనే 2022 మార్చి వరకు 2,93,185 రేషన్‌కార్డుల అర్జీలు పెండిరగ్‌లో ఉన్నట్లు ఆర్టీఐ అభ్యర్థనకు వచ్చిన సమాధానం ప్రకారం ఆహార హక్కు ఉద్యమ కార్యకర్త అంజలీ భరద్వాజ్‌ వెల్లడిరచారు. జనాభా లెక్కలను ప్రభుత్వం పరిగణించి ఉంటే నేడు కోట్లాది మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చేవారని, ఆహార ధాన్యాలను ప్రతినెలా పొందే వారని ఆహార హక్కు ఉద్యమ కార్యకర్త అమృతా జోహ్రీ అన్నారు. పౌరులకు ఆహార భద్రత కల్పనకు ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోవడానికి కారణాలు ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈశ్రమ్‌ పోర్టల్‌లో 28 కోట్ల మందికిపైగా అసంఘటిత రంగాల కార్మికులు నమోదై ఉంటే వారందరికీ రేషన్‌ కార్డులు లేవని గుర్తుచేశారు. ఎవరికి కార్డులు ఉన్నాయి… ఎవరికి లేవన్నది ఆరా తీసి తగు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. జనగణనను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైనందున ప్రజలకు రేషన్‌ లభించడం లేదని, ఇది అమానవీయమని ఆమె నొక్కిచెప్పారు.
ఇదిలావుంటే, దేశంలోని ఆహార అభద్రతా సమస్యను పరిష్కరించాలని 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రభుత్వం తెచ్చింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోనే పీడీఎస్‌ ఉంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం పీడీఎస్‌ పరిధిలో 75శాతం గ్రామీణ, 50శాతం పట్టణ జనాభా ఉంది. ఆహార ధాన్యాల కేటాయింపుల్లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏకు అవసరం. లబ్ధిదారులను గుర్తించడం, పథకం సమర్థంగా అమలు కావడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకం. ప్రభుత్వ తాజా డేటా ప్రకారం 81.34 కోట్ల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్నారు. అయితే ఈ పథకానికి అర్హులైన వారి సంఖ్యతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య తక్కువని నిపుణులు అన్నారు. రేషన్‌కార్డుల సమస్యను పరిష్కరించడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిని విస్తరించాలనే డిమాండ్‌ కొనసాగుతోంది. జనగణన ఆధారంగా లబ్ధిదారుల లెక్కింపు ఉంటుంది. చివరిసారి 12ఏళ్ల కిందట జనగణన జరిగింది. ఈ క్రమంలో 2011 జనగణన డేటా ఆధారంగా లబ్ధిదారుల సంఖ్య ఉన్నది. ఆ తర్వాత జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండానే రేషన్‌ కార్డులను ప్రభుత్వం కేటాయించింది. కాగా దాదాపు పది కోట్ల మంది పీడీఎస్‌ పరిధిలో లేరని ఆర్థికవేత్తలు జీన్‌ డ్రేజ్‌, రీతికా ఖేరా పేర్కొన్నారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడిరది. 2022, జులై 28న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కోవిడ్‌ వల్ల జనాభా లెక్కలు2021ను తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేసినట్లు కేంద్రం తెలిపింది. 2023, జనవరి 2న ది రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్జీఐ) పరిపాలనపరమైన గడువును జూన్‌ వరకు పొడిగించింది. అంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం లేదు.
ప్రపంచ ఆకలి సూచీ2022లో 121 దేశాలలో 107వ స్థానంలో భారత్‌ ఉంది. దీనినిబట్టి దేశంలో ఆకలి సమస్య ఏ స్థాయిలో ఉన్నది తెలుస్తోంది. సామాజికార్థిక పరిస్థితులపరంగానూ మహమ్మారి కారణంగా తీవ్రత పెరిగింది. వలస కార్మికులకు కేంద్రంగా దిల్లీ ఉంది. జనాభా పెరిగేకొద్దీ కొత్త రేషన్‌కార్డుల అవసరం పెరుగుతోంది. 2021 జులైలో ‘బంధువా ముక్తి మోర్చా’ దాఖలు చేసిన పిటిషన్‌లో మినహాయింపు గురించి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధి విస్తరణ అవసరమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రయోజనాలు 2011 జనాభా డేటాకు పరిమితం కాకుండా ఒక ఫార్ములా సిద్ధం చేయాలని కేంద్రానికి సూచించింది. జనగణన డేటా అందుబాటులో లేదని, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిని పెంచాలంటే సవరణ అవసరమని కేంద్రప్రభుత్వం అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. జనాభా పెంపుదల దృష్ట్యా లబ్ధిదారుల సంఖ్యను పెంచాల్సి ఉన్నాగానీ ఇన్నేళ్లలో పేదల జనాభా తగ్గడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ అఫిడవిట్‌ వెల్లడిరచింది. 2013లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని నీతిఆయోగ్‌ అందులోలో వాదించింది. గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం జనాభా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం తప్పుగా అన్వయించుకున్నదని నిపుణులు అంటున్నారు. తలసరి ఆదాయం ఆధారంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిని నిర్ణయించడం తగదని, ఆదాయంసంపద మధ్య అసమానతను ప్రభుత్వం పట్టించుకోలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img