Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఆ జీవో దుర్మార్గం

నియంతలా వ్యవహరిస్త్తున్న జగన్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుగ్లక్‌, హిట్లర్‌ల మాదిరిగా నియంత పాలనకు తెరతీశారనీ, ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తూ జీవో విడుదల చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…పోలీస్‌ యాక్ట్‌ 1861 సెక్షన్‌ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు, సమావేశాలు జరపకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి చీకటి జీవో విడుదల చేసిందన్నారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన ప్రమాద ఘటనలను సాకుగా చూపిస్తూ ఈ జీవో తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకునేందుకు జగన్‌ దుష్టబుద్ధితో ఆలోచిస్తున్నారనీ, పోలీసులను ప్రయోగించి ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌వారు చేసిన పోలీస్‌యాక్ట్‌లో సెక్షన్లను ఉదహరిస్తూ వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉత్తర్వులివ్వడాన్ని తప్పుబట్టారు. గత ఎన్నికలకు ముందు జగన్‌, షర్మిల ఓదార్పుయాత్ర, పాదయాత్రలు చేయలేదా? ప్రత్యేక పరిస్థితుల్లో సభల నిర్వహణకు అనుమతిస్తామంటున్నారనీ, వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. జగన్‌ అధికారం చేపట్టాక ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై నిర్బంధకాండను ప్రయోగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నియంత పాలన సాగుతోందనడానికి ఈ జీవోనే నిదర్శనమన్నారు. రోడ్డు, రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రయాణాలు మానేస్తారా, మానుకోమంటారా? విశాఖ పారిశ్రామికవాడలో అనేక దఫాలుగా ప్రమాదాలు జరిగి, అనేక మంది మృతిచెందారు. అందువల్ల పరిశ్రమలను మూసివేసే జీవో తెస్తారా? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను వైసీపీ గెలుస్తుందనే మైండ్‌గేమ్‌ ఆడుతున్న జగన్‌కు ప్రతిపక్షాలు చేపట్టే కార్యక్రమాలంటే ఉలుకెందుకు? అని ఘాటుగా ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన ఘటనలపై ఏదైనా కుట్రకోణం దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోందనీ, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. నిఘా వర్గాలు, పోలీసుల వైఫల్యంపైనా విచారించి, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే చీకటి జీవోను ఉపసంహరించాలని, లేకుంటే అన్ని రాజకీయ పక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img