Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఆ తుపాకీలు పేలాయిగానీ…

లఖింపూర్‌ ఖేరి హింస కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక

లఖింపూర్‌ : లఖింపూర్‌ ఖేరి హింస కేసులో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా, ఇతర నిందితుల ఆయుధాలను పరీక్షించి అవి పేలినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బుధవారం నిర్థారించింది. అయితే అవి హింస జరిగిన రోజే పేలాయో లేదో చెప్పలేకపోయింది. ఆశీష్‌ మిశ్రా అలియాస్‌ మోనూ మిశ్రా వద్ద నుంచి నాలుగు ఆయుధాలను సీజ్‌ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్‌ దాస్‌ మేనల్లుడు అంకిత్‌ దాస్‌ వద్ద నుంచి ఓ పిస్టల్‌ను, ఆయన అంగరక్షకుడు లతీఫ్‌ కాలే వద్దనున్న రిపీటర్‌ గన్‌నూ అధికారులు స్వాధీనం చేసుకొని పరీక్షించారు. దాస్‌ సన్నిహితుడు సత్య ప్రకాశ్‌కు చెందిన రివాల్వర్‌ ( పరీక్షించిన నాల్గో ఆయుధం)పై ఫోరెన్సిక్‌ నివేదిక రావాల్సి ఉంది. బాలిస్టిక్‌ పరీక్ష కోసం ఎఫ్‌సీఎల్‌కు నాలుగు ఆయుధాలు పంపగా అందులో మూడు (ఆశీష్‌ మిశ్రా రైఫిల్‌తో కలిపి) పేలినట్లు నిర్థారణ అయిందిగానీ అవి ఎప్పుడు పేలాయో రిపోర్టులో లేదని సీనియర్‌ అధికారి తెలిపారు. కేసును విచారిస్తున్న సిట్‌ బృందం ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికపై అధికారిక ప్రకటన చేయలేదు. ఆశీష్‌, దాస్‌, కాలే అరెస్టు అనంతరం వారి లైసెన్స్‌డ్‌ ఆయుధాలు (రైఫిల్‌, పిస్టల్‌, రివాల్వర్‌, రిపీటర్‌ గన్‌)లను అక్టోబరు 15న ఫోరెన్సిక్‌ పరీక్షకు సిట్‌ పంపింది. బహ్రెయిచ్‌ జిల్లాకు చెందిన జగ్జీత్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం లఖింపూర్‌ హింసాకాండ ఓ పథకం ప్రకారం జరిగిందని, మంత్రి, ఆయన కుమారుడు పక్కా స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 3న రైతులంతా మహారాజా అగ్రసేన్‌ ఇంటర్‌ కాలేజిలోని క్రీడా మైదానం వద్దకు చేరుకొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, ఆశీష్‌ మిశ్రాకు నల్ల జెండాలు చూపి శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు మిశ్రా మరో 1520 మందితో కూడిన మూడు, నాలుగు వాహనాలు బంబీర్పూర్‌లోని నిరసన స్థలానికి దూసుకొచ్చాయి. మహీంద్ర ధార్‌ వాహనంలో ఎడమ వైపు కూర్చొనివున్న ఆశీష్‌ మిశ్రా కాల్పులు జరిపారు. ఆ వాహనం అడ్డువచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లింది. కాల్పుల్లో రైతు గుర్విందర్‌ సింగ్‌, ఆయన తనయుడు సుఖ్విందర్‌ ప్రాణాలు కోల్పోయారు. వీరు నంపారాలోని మాట్రోనియా ప్రాంతానికి చెందినవారు’ అని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. గుర్విందర్‌ సింగ్‌ మృతదేహాన్ని రెండుసార్లు పరీక్షించిన తర్వాత ఆయన మరణానికి బుల్లెట్‌ గాయాలు కారణం కాదని తేల్చారు. ఆశీష్‌తో పాటు గుర్తుతెలియని 1520 మందిపై హత్య, క్రిమినల్‌ కుట్ర, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అల్లర్లు సృష్టించడం వంటి ఆరోపణల కింద కేసులు నమోదు కాగా ఈ వ్యవహారంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుంటే జర్నలిస్టు రమణ్‌ కశ్యప్‌ సోదరుడు పవన్‌ మంగళవారం జిల్లా కోర్టును ఆశ్రయించారు. మంత్రి, ఆయన కుమారుడితో పాటు 14 మందిపై తన సోదరుడి హత్య కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. అక్టోబరు 3న రైతుల ర్యాలీ వార్తా సేకరణ కోసం తన సోదరుడు తికునియాకు వెళ్లారని, అక్కడ హింస చెలరేగి వేగంగా వచ్చిన ఎస్‌యూవీ కింద పడి మరణించారని పవన్‌ తెలిపారు. తన సోదరుడు కారు కింద పడి చనిపోయినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి అయిందన్నారు. ఈ క్రమంలో నమోదైన కేసును కోర్టు 15వ తేదీన విచారించనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img