ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే జర్నలిజం చేవచచ్చి మౌనం వహించినా… భయపడి మౌనం వహించినా…చారిత్రక తప్పిదమే అవుతుంది. పేజీలకన్నా నిజాలకే ప్రాధాన్యతనిచ్చే జర్నలిజం ముప్పేటదాడులను ఎదుర్కొని, గుండెనిబ్బరంతో ముందుకు సాగుతోంది. అయినప్పటికీ అభద్రతాభావం ఏదో ఒక రూపంలో వెంటాడుతోంది. హక్కులకు ప్రాణంపోసే జర్నలిస్టు బతుకు దిక్కులేకుండా పోతోంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా భావస్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు జర్నలిస్టు బలవుతున్నాడు. ఏడాదిన్నర కాలంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ‘ముందుండి పోరాడుతున్న యోధుడి’గా నిలిచిన జర్నలిస్టును ఏ ఒక్క ప్రభుత్వమూ ‘ఫ్రంట్‌లైన్ వారియర్’గా గుర్తించలేదు. అయినా సమాచార సేకరణలో, హక్కుల పోరులో అగ్రగామిగా కొనసాగుతూనే వున్నాడు. నిజానికి తప్ప ఏ ఒక్కరికీ గులామ్‌కాని పాత్రికేయుని ఊపరిసలపని పోరాటానికి లాల్‌సలామ్!
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నియంతగా మారకముందే, 1920వ సంవత్సరం నుంచే జర్మనీ ప్రెస్‌ను తన చెప్పుచేతల్లోకి పూర్తిగా తీసుకున్నాడు. రెండో ప్రపంచయుద్ధం ముగిసే వరకు ఈ నియంత్రణ కొనసాగింది. నాజీ యుద్ధఖైదీలుగా వెలికి, ఉరికి గురైన వారు, పత్రికా నిపుణులు రాసే రాతలను, పుస్తకాలను నియంత్రించడానికి ఆయన ఏకంగా ఒక బృందాన్నే నియమించాడు. ఆ విధానంతోనే హిట్లర్ 1932 నాటికే పూర్తిస్థాయి నియంతగా అవతరించాడు. అంతకుముందు, బెన్నెటో ముస్సోలినీ కూడా ప్రెస్‌ను అణగదొక్కడంలో ఘనుడిగా నిలబడ్డాడు. 1914లో మొదటి ప్రపంచయుద్ధం మొదలుకాకముందే ఏళ్ల తరబడి ఇటలీలో భావస్వేచ్ఛ ఉండేదికాదు. యుద్ధం మొదలయ్యాక అతను చిత్తుగా ఓడిపోయే వరకు ఐదేళ్లపాటు ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రెస్ తరహా ఫ్రీడమ్‌పై కఠిన ఆంక్షలు అమలు చేశారు. గోబెల్స్ ఎత్తుగడలు, సమీకృత దుష్ప్రచార విభాగాలు ఆయన హయాంలోనే మొదలై, హిట్లర్ కాలంలో గొప్పగా పరిఢవిల్లాయి. భారతదేశ ప్రజలు ముస్సోలినీ, హిట్లర్ విధానాలను లోతుగా అధ్యయనం చేస్తే, ప్రస్తుతం మోదీగారి విధానాలు కూడా అటుఇటుగా అలాగే కన్పిస్తాయి. సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో పాత్రికేయులకు కాస్త ఊరట లభించింది. అయితే ఈ తీర్పును మోదీ బృందం జీర్ణించుకుంటుందని ఆశించలేం. భావస్వేచ్ఛమీద, పత్రికాస్వేచ్ఛమీద మోదీ సర్కారు జులుం రోజురోజుకీ పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటివరకు 17 మంది పాత్రికేయులు ఘోర హత్యకు గురయ్యారు. ఆత్మహత్యగానో, ప్రమాదంగానో చిత్రీకరించడం వల్ల స్కాముల హోమంలో బలైన విలేకరులు ఎందరో వున్నారు. మారిన ఎఫ్‌ఐఆర్‌లతో కంటికి కనబడని హత్యలు ఇంకెన్నో ఉన్నాయి. 3 వేలకు పైగా వేధింపులు, భౌతికదాడులు జరిగాయి. లెక్కల్లో లేనివి ఇంకెన్నో. అంతెందుకు? గడిచిన ఆరేళ్లలో 211 మంది ఆర్‌టిఐ కార్యకర్తలు తీవ్ర వేధింపులకు గురికాగా, 163 మందిపై భౌతికదాడులు జరిగాయి. మరో 95 మంది ఆర్‌టిఐ కార్యకర్తలు, విజిలెంట్స్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులపై హత్యలు, దాడులు పక్కనబెడితే, ఆర్థిక పరిస్థితులు సహకరించక, ప్రభుత్వాల సహకారం అందక ఆకలికేకలతో చనిపోయినవారు, ఆత్మహత్య చేసుకున్నవారు వందల్లో వున్నారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1500 మందికిపైగా జర్నలిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే 150 మందికిపైగా పాత్రికేయ మిత్రులు కొవిడ్ 19తో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాలు ఏ ఒక్కరికీ అందలేదు. లాక్‌డౌన్, కర్ఫ్యూల కాలంలో పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్యసిబ్బంది ఎనలేని సేవలు అందించినట్లు ప్రభుత్వం చెపుతోంది. కానీ పోలీసుల విషయంలో పౌరహక్కుల ఉల్లంఘనలు యధేచ్ఛగా సాగుతున్నా, కార్పొరేట్ వైద్యశాలలపై విపరీతంగా ఆరోపణలు వస్తున్నా…వారంతా ఫ్రంట్‌లైన్ వారియర్లుగానే వెన్నువిరిచి నడుస్తున్నారు. కరోనాను అడ్డుకోవడంలో వారంతా గొప్ప కృషి చేసినవారే. ఇలాంటి సమయంలో పాజిటివ్‌గానే చూడాలి కాబట్టి వారిని ఏమీ అనాల్సిన పనిలేదు. కానీ ప్రాణాలొడ్డి, కవరేజీలు చేస్తూ, కథనాలు రాస్తూ, ఎప్పటికప్పుడు కరోనాపై సమాచారాన్ని విశ్వవ్యాప్తంగా చేస్తూ, ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ, రాత్రి 12 వరకు డ్యూటీ చేసి, పొద్దునే విధుల్లోకి పరుగులుపెట్టే జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా నేటికీ గుర్తించకపోవడం వెనుక ఫాసిస్టు విధానాలు విస్పష్టం. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కొన్ని రోజుల క్రితం చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తేలిపోయింది. పాత్రికేయులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలంటే వారిలో ఇంకెంతమంది చావాలి? దానికొక లెక్క చెప్పాలి? ఈ రెండు ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానమివ్వాలి?
-కూన అజయ్‌బాబు