Friday, September 22, 2023
Friday, September 22, 2023

‘ఇంటి నుంచే పని’ బలోపేతం

ఇందుకోసం ప్రతి పల్లెకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలకూ సదుపాయం
తొలివిడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం
ఐటీ సమీక్షలో సీఎం జగన్‌

అమరావతి : ప్రతి పల్లెకూ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారి లాంటి విపత్తులను తట్టుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఐటీ శాఖ, డిజిటల్‌ లైబ్రరీపై ముఖ్యమంత్రి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్‌ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. వీటిపై తక్షణమే ప్రణాళిక సిద్ధం చేసి ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా స్థలాలు ఎంపిక ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌ నాటికి డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. కంప్యూటర్‌ పరికరాల కోసం సుమారు రూ.140 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. డిజిటల్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో కనీస సదుపాయాలతోపాటు బార్‌కోడ్‌ ప్రింటర్‌, స్కానర్‌, లేజర్‌ ప్రింటర్‌, అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ ఉంటాయని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా ఈ డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులతోపాటు అన్ని రకాల పోటీల పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అలాగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు కూడా ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలని, అది నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం.మధుసూదన రెడ్డి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం.నందకిషోర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img