Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఇక ప్రత్యక్ష పోరు

ఉక్కు పరిరక్షణసభలో కార్మిక నేతల పిలుపు

జులై 4న ప్రధానికి నిరసనలు
కేంద్రం దిగొచ్చేవరకు ఉద్యమాన్ని ఆపబోమని ప్రతిన
విశాఖలో కదం తొక్కిన కార్మికులు…మహా ర్యాలీ
500 రోజుకు చేరిన ఉక్కు పరిరక్షణ దీక్షలు

విశాలాంధ్ర`విశాఖ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై 500వ రోజు ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. ఇన్నిరోజులూ వివిధ రూపాల్లో నిరసన తెలిపిన కార్మిక నేతలు… మరో అడుగు ముందుకేసి మహా ర్యాలీ నిర్వహించారు. తొలుత స్టీల్‌ప్లాంట్‌ ముఖద్వారం నుంచి దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయం వరకు వేలాదిమంది కార్మికులతో కలిసి బైక్‌ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి జీవీఎంసీ గాంధీబొమ్మ వరకు మహార్యాలీ చేపట్టారు. అనంతరం.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నిర్ణయంపై ఇక నుంచి ప్రత్యక్షపోరుకు దిగుతామని కార్మిక నేతలు ప్రకటించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కోసం అంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. మళ్లీ తెగించే పరిస్థితి తీసుకురావొద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయ నేతలు సంతకాలు సేకరించి పంపడంతోనే సరిపెట్టకుండా.. రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. ఖాళీగా ఉన్న ప్లాంటు భూమిని స్థిరాస్థి వ్యాపారానికి వినియోగిస్తామంటే ఊరుకోబోమని కార్మికులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట పరిరక్షణ కోసం స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సీఎం జగన్‌తో చర్చించాలని డిమాండ్‌ చేశారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… జులై 4వ తేదీన విశాఖ వస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు ఎక్కడకక్కడ నిరసనలు తెలపాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు రక్షణ కోసం ప్లాంట్‌ వద్ద జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారానికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ, విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ అధ్వర్యాన రైల్వే డీఆర్‌ఎం ఆఫీన్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మందితో మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్లు పడాల రమణ, బి.నాగభూషణం అధ్యక్షతన జివిఎంసి వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్‌, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రఘురామరాజు, పీఓడబ్ల్యు, ఐద్వా రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి, బి.పద్మ ముఖ్యఅతిథ్లుగా హాజరై ప్రసంగిస్తూ… విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం ద్వారా కేంద్రం విశాఖకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకుల పర్యటనలను అడ్డుకోవాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వాడి తూటాలకు ఎదురొడ్డి అల్లూరి సీతారామరాజు పోరాడిన విశాఖ గడ్డపై కాలుమోపే నైతిక హక్కు ప్రధాని మోదీకి, బీజేపీ మంత్రులకు లేదని అన్నారు. నాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అల్లూరి పోరాడితే నేడు మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ప్రజల సంపద అయిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 32 మంది ప్రాణత్యాగం, 22వేల ఎకరాల భూములుచ్చిన 64 గ్రామలకు చెందిన 16500 మంది నిర్వాసితుల త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అమ్మే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడంతో పాటు బొగు ్గ కొరతను సృష్టించి స్టీల్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఉద్దేశపూర్వకంగానే మోదీ సర్కారు ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. నష్టాల పేరుతో స్టీల్‌ప్లాంట్‌ అమ్యాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం విరమించుకోకుంటే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఐక్యంగా ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేందుకు పూనుకోవాలని, పార్లమెంట్‌లో రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ ఐక్యంగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేసేవరకు ఎన్ని వందల రోజులైనా ఉద్యమం సాగుతుందని, ఆందోళన ఉధ ృతం చేయకతప్పదని హెచ్చరించారు.
గత 500 రోజుల నుంచి సాగుతున్న ఉద్యమంలో స్టీల్‌ప్లాంట్‌ పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, నిర్వాసితులతో పాటు విశాఖలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొనడం అభినందనీయమన్నారు. వారితోపాటు రెక్కాడితే గాని డొక్కాడని ఇంటిపనివారలు, ఆశ, అంగన్‌వాడీ, మిడ్‌ డే మీల్‌, మున్సిపల్‌, భవననిర్మాణం, తోపుడుబండ్లు, ఆటో, ముఠా, ట్రాన్స్‌పోర్టు, షాప్స్‌, హోటల్స్‌, హాస్పిటల్స్‌, గోడౌన్స్‌, చిన్నపరిశ్రమలు తదితర అసంఘటితరంగ కార్మికులు ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. కార్మికవర్గంతో పాటు విద్యార్థులు, మహిళలు, యువత, మేధావులు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, వికలాంగులు, దళితసంఘాలు, పెన్షనర్లు, పత్రికా సిబ్బంది తదితర అనేక రంగాలవారు భాగస్వాములు కావడం ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చిందని వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సభలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సీఐటీయూ నాయకులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జె.అయోధ్యరాం, సిఎఫ్‌టియుఐ నాయకులు పి.సురేష్‌, వెంకటలక్ష్మి, ఐఎఫ్‌టియూ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం నాయకుడు దొమ్మేటి అప్పారావు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకుడు వై.మస్తానప్పా, ఏఐసీటీయూ నాయకుడు ఆర్‌.నానాజీరావు, టీఎన్‌టీయూసీ నాయకుడు వి.రామ్మోహన్‌ కుమార్‌, నిర్వాసితుల సంఘం నాయకులు జి.సత్యారావు, పి.భాస్కరరావు, ఏఐటీయూసీ నాయకులు కె.సత్యన్నారాయణ, ఎం.మన్మధరావు, డీవైఎఫ్‌ఐ నాయకుడు యు.ఎస్‌.ఎన్‌.రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఎల్‌.జె.నాయుడు, కేవీపీఎస్‌ నాయకుడు ఆర్‌.పి.రాజు, డీహెచ్‌పీఎస్‌ నాయకుడు ఎ.ప్రభాకర్‌, జెఎంఎస్‌ నాయకుడు వరస శ్రీనివాసరావు, ఎల్పీఎఫ్‌ నాయకుడు వి.రామక ృష్ణ, ప్రజానాట్యమండలి నాయకుడు ఎం.చంటి, అరుణోదయ సాంస్క ృతిక మండలి నాయకురాలు నిర్మల తదితరులు ప్రసంగించారు. విశాఖలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల యూనియన్ల నాయకులు, అసంఘటితరంగ యూనియన్ల నాయకులు, కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img