Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఇక మలిదశ ఉద్యమం

. ప్రభుత్వ వైఖరిపై ‘ఏపీ జేఏసీ అమరావతి’ ఆగ్రహం
. డిమాండ్ల పరిష్కారానికి మరోసారి సీఎస్‌కు నోటీసు
. ‘చలో విజయవాడ’కు నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ నాన్చుడు ధోరణిని నిరసిస్తూ ఉద్యమం ఉధృతం చేయడానికి ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమైంది. మలిదశ ఉద్యమ కార్యాచరణతో జగన్‌ సర్కారుపై ఒత్తిడికి కార్యాచరణ రూపొందించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ తదితరుల డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం విజయవాడ బందరురోడ్డులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు అధ్వర్యంలో నేతలు నోటీసు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని, మళ్లీ చలో విజయవాడకు సిద్ధమవుతామని హెచ్చరించారు. గతంలో ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఆందోళన ప్రభుత్వానికి వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. బీఆర్‌టీఎస్‌ రోడ్డుపైకి రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. పోలీసుల చక్రబంధాన్ని సైతం ఛేదించి, మారు వేషాలతో రైళ్లు, బస్సుల ద్వారా విజయవాడ చేరుకున్నారు. వారి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా సంఫీుభావం తెలిపాయి. చలో విజయవాడ విజయవంతం కావడం జగన్‌ సర్కారు నివ్వెరపరిచింది. పోలీసులు పరోక్షంగా సహకరించారనే నెపంతో డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు బదిలీ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి తొలి దశ ఉద్యమాన్ని పూర్తి చేసుకుని మలి దశకు చేరడంతో జగన్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మూడో దశ ఉద్యమంలో భాగంగా పెద్దఎత్తున మరోసారి ‘చలో విజయవాడ ’ నిర్వహిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ దామోదరరావు ప్రకటించడం చర్చానీయాంశంగా మారింది.
ఉద్యోగులపై ఎందుకీ వివక్ష ?
ఆంధ్రప్రదేశ్‌పై జగన్‌ సర్కారు ఎందుకు వివక్ష చూపుతోందంటూ ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులుపైన, ఆర్థికేతర సమస్యలపైన ఫిబ్రవరి 13న సీఎస్‌ జవహర్‌రెడ్డికి 50 పేజీల వినతిపత్రాన్ని అందజేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపడంతోనే ఈ ఉద్యమ పరిస్థితి దాపురించింది. దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని జేఏసీ నేతలు నొక్కి చెబుతున్నారు. ఇప్పటివరకు ఉద్యమ ప్రారంభానికి ముందు ప్రభుత్వంతో రెండు విడతలుగా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేపట్టినా ఫలితం లేదు. వారికి చట్టప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక పరమైన అంశాలపైన మౌనం దాల్చుతోంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలు, ఇప్పటివరకు చెల్లింపులపై స్పష్టత లేదు. ప్రధానంగా ఒక్క ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణితో వారంతా అసంతృప్తికి గురై ఉద్యమబాట పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు/పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. కనీస వేతనాలు, పెన్షన్లు జాప్యంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది.
డిమాండ్లు సాధించేంతవరకు ఉద్యమం: ఏపీ జేఏసీ అమరావతి
తమ న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీఎస్‌కు మలిదశ ఉద్యమ నోటీసు ఇచ్చిన అనంతరం ఏపీ జేఏసీ అమరావతి నేతలు మీడియాతో మాట్లాడారు. బొప్పరాజు దామోదరరావు మాట్లాడుతూ… ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉద్యోగసంఘాల డిమాండ్లను నిజాయితీగా పరిష్కరించాలన్నారు. వారి ఆర్థికపరమైన విషయాలపై లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలన్నారు. ఆర్థికేతర సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తే అభద్రతా భావం, ఆందోళన, ఆవేదనతో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని, అప్పుడే తమ ఉద్యమానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సీఎస్‌ను కలిసిన ఏపీ జేఏసీ అమరావతి నేతల్లో బి.కిశోర్‌ కుమార్‌, ఐఎల్‌ నారాయణ, ఏ.సాంబశివరావు, ఎస్‌.మల్లేశ్వరరావు, సుమన్‌, బత్తిన రామకృష్ట, శ్రీనివాస్‌, ప్రవీన్‌ కుమార్‌రెడ్డి, చింతకాయల అప్పారావు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img