Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ఇదెక్కడి సామాజికన్యాయం

ఒక్కొక్కరికీ రెండు పదవులు
ఒకే కుటుంబంలోఇద్దరికి మూడు పదవులు
వదిన కార్పొరేటర్‌,మరిది ఎమ్మెల్సీ!
తొలి నుంచి వైసీపీలో ఉన్నవారికి గుర్తింపు ఏదీ!
ఎన్టీఆర్‌ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి
ఏ ముఖం పెట్టుకుని ‘సామాజిక న్యాయభేరి’కి వెళ్లాలని ఆవేదన
నేడు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు వైసీపీ బస్సుయాత్ర

విశాలాంధ్ర ప్రతినిధి`విజయవాడ : ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నాదమ్ములకు మూడు కీలక పదవులు… మరొక కుటుంబంలో వదిన, మరిదికి పదవులు… ఒకరికే రెండు పదవులు… ఇలా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో కొందరినే ప్రభుత్వ పదవులన్నీ వరించాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పని చేసినవారిని, ఎన్నికల సమయంలో పదవులు ఆశచూపి పార్టీలో చేర్చుకున్నవారిని నేటికీ పట్టించుకోలేదు. దీంతో అధికార పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒక్కరికే రెండు పదవులు, ఒకే కుటుంబంలో రెండు, మూడు పదవులు ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తమకన్నా వెనక వచ్చినవారు లాబీయింగ్‌ ద్వారా పదవులు తన్నుకుని వెళుతున్నారని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి యాత్ర’లో తాము ఏ ముఖం పెట్టుకుని పాల్గొనాలని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పదవుల పంపకాల పరిస్థితి..!
అ నందిగామ ఎమ్మెల్యేగా డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు ఉన్నారు. ఆయన తమ్ముడు డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌కు తొలుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఇచ్చారు. అరుణ్‌కుమార్‌ ఆ పదవిలో కొనసాగుతుండగానే ఇటీవల ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం విశేషం. దీంతో అన్నాదమ్ములకు మూడు కీలక పదవులు దక్కాయి.
అ గొల్లపూడికి చెందిన తలశిల రఘురాం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కేబినెట్‌ హోదాతో కొనసాగుతున్నారు. ఆ పదవితోపాటు ఆయనకు శాసనమండలి సభ్యుడిగా కూడా అవకాశం కల్పించారు.
అ విజయవాడకు చెందిన రహుల్లా వదిన కార్పొరేటర్‌గా ఉన్నారు. రహుల్లా తల్లి కరీమున్నీసాకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆమె ఆకస్మింగా మరణించడంతో రహుల్లాను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ప్రస్తుతం రహుల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు.
అ విజయవాడకు చెందిన కార్పొరేటర్‌ బండి పుణ్యశీలకు మేయర్‌ పదవి దక్కుతుందని అందరూ భావించినా, అనూహ్యంగా రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా ఎంపిక చేశారు. దీంతో పుణ్యశీల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి కేటాయించారు.
అ విజయవాడలో కార్పొరేటర్‌గా ఉన్న అడపా శేషుకు ఆంధ్రప్రదేశ్‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.
వీరిని పట్టించుకోరా…!
అ వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మిత్రుడు అయిన రామచంద్రరావు తొలి నుంచి వైఎస్‌ జగన్‌కు అండగా నిలిచారు. ఆయన 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారు. గత ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు వైసీపీ సీటు ఇచ్చినా ఆయనకు అండగా నిలిచారు. స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీపై వెంకట్రావు ఓడిపోయారు. వెంకట్రావును నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించి, కేడీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో వంశీ వైసీపీకి మద్దతు తెలియజేయడంతో ఇటీవల ఆయనకే నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు రాజకీయాల నుంచి దాదాపు కనుమరుగయ్యారు. దుట్టా రామచంద్రరావు మాత్రం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు అన్యాయం జరుగుతోందని పోరాటం సాగిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనిపై వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. మరోవైపు దుట్టా రామచంద్రరావు కోడలు బాపులపాడు జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి లభిస్తుందని ఆశించినా నిరాశేమిగిలింది.
అ విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి 2019 ఎన్నికలకు కొద్దికాలం ముందు వైసీపీలో చేరారు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనూహ్యంగా అప్పట్లో కార్పొరేటర్‌గా ఉన్న బొప్పన భవకుమార్‌కు విజయవాడ తూర్పు సీటు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని అప్పట్లో రవికి హామీ ఇచ్చారని సమాచారం. కానీ నేటికీ ఆయనను పట్టించుకోలేదు. ఆయన కూడా ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
అ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పని చేసిన మైనారిటీ నాయకుల్లో డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ ఒకరు. ఆయన వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో సుమారు నాలుగేళ్లు ప్రతి వారం క్రమం తప్పకుండా ఉచిత వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు, మెగా మెడికల్‌ క్యాంపులు పెద్ద సంఖ్యలో నిర్వహించారు. ఉన్నత విద్యావంతుడైన డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ ఇప్పటికీ వైసీపీ తరఫున జాతీయ మీడియా చర్చల్లో పాల్గొంటున్నారు. అయినా ఆయనకు ఎటువంటి పదవి లభించలేదు.
అ వైసీపీ కార్పొరేటర్‌గా, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా సేవలు అందించడంతోపాటు ప్రస్తుతం విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్‌కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఖాయమని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయనకు కూడా నేటికీ ఏ పదవి ఇవ్వలేదు.
అ వీరితోపాటు మరికొందరు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో తమ అధిష్టాన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
అ ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎటువంటి వ్యతిరేకత కనిపించకుండా జయప్రదం చేసేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img