రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పెరిగిన ఉష్ణోగ్రతలు
. పోడూరు, బుచ్చిరెడ్డిపాలెంలో 46 డిగ్రీల నమోదు
. అత్యధిక ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే
. మధ్యాహ్నం కర్ఫ్యూను తలపిస్తున్న రహదారులు
. తల్లడిల్లుతున్న వృద్ధులు, పిల్లలు, మహిళలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో అగ్నివర్షం కురుస్తోంది. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండకు తోడు వడగాడ్పులు కూడా మొదలవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ 44 డిగ్రీల ఉష్ణోగ్రత పైగా నమోదు కావడం విశేషం. కర్నూలు జిల్లా పోడూరులో అత్యధికంగా 46 డిగ్రీలను తాకగా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 45.35 డిగ్రీలు నమోదైంది. దెందులూరు, ఉదయగిరి, రాజాం మండల కేంద్రాల్లోనూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 24 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 18 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 3 మండలాలు సహా మొత్తం 110 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల సంస్థ వెల్లడిరచింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ముఖ్య నగరాల్లో కూడా రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. కార్లు ఉన్న వాహన యజమానులు సైతం ఎండ తీవ్రతకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని బయట తిరగడానికి భయపడుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండ తీవ్రత ఈ స్థాయిలో ఉందంటే, ఇక రోహిణీ కార్తెలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండకు తల్లడిల్లిపోతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని డా.బీఆర్ అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా 98 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 70 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాడ్పుల హెచ్చరిక ఎప్పటికప్పుడు సందేశాల ద్వారా పంపుతున్నామని, ఈ సమాచారం అందినప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన్యం జిల్లా కొమరాడలో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి జిల్లాలో 7, అనకాపల్లిలో 16, తూర్పుగోదావరిలో 2, ఏలూరులో 2, గుంటూరులో 3, కాకినాడలో 10, కృష్ణాలో 2, ఎన్టీఆర్‌లో 8, పల్నాడులో ఒకటి, పార్వతీపురం మన్యంలో 12, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 19, వైఎస్‌ఆర్‌లో 10 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలియజేశారు.