Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఈసారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెటే..

బడ్జెట్‌ ‘హల్వా’ కూడా లేదు..దానికి బదులుగా స్వీట్లు
దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ థర్డ్‌వేవ్‌ భయాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను గత ఏడాది మాదిరిగా పేపర్‌లెస్‌ ఫార్మాట్‌లో సమర్పించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.అలాగే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ‘హల్వా’ వేడుకను కూడా రద్దు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.కేంద్ర బడ్జెట్‌ 2022-23ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ .. 1 ఫిబ్రవరి, 2022న పేపర్‌లెస్‌ రూపంలో ప్రవేశపెడతారని.. యాప్‌ లో ఇది ప్రసారం అవుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. 2021-22 లో యూనియన్‌ బడ్జెట్‌ మొదటిసారిగా పేపర్‌లెస్‌ రూపంలో ప్రవేశపెట్టారని తెలిపింది. పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), సాధారణ ప్రజలు బడ్జెట్‌ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్‌ చేయడానికి ‘‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’’ కూడా ప్రారంభించినట్లు తెలిపింది. పార్లమెంట్‌లో 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్‌ సమర్పణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర బడ్జెట్‌ 2022 -23 మొబైల్‌ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.బడ్జెట్‌ యాప్‌ ప్రకారం.. 14 యూనియన్‌ బడ్జెట్‌ పత్రాలకు పూర్తి ప్రాప్యతను అనుమతిస్తుంది. ఇందులో సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం, రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక నివేదిక (సాధారణంగా బడ్జెట్‌ అని పిలుస్తారు), గ్రాంట్ల డిమాండ్‌, ఫైనాన్స్‌ బిల్లు, ఇతర అంశాలు ఉన్నాయి. మొబైల్‌ యాప్‌ ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. యాప్‌ను యూనియన్‌ బడ్జెట్‌ వెబ్‌ పోర్టల్‌ నుండి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్‌ వెబ్‌ పోర్టల్‌లో సామాన్య ప్రజలు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి బడ్జెట్‌ పత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
‘హల్వా’ వేడుక ఈ సంవత్సరంలో కూడా రద్దు చేశారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థికశాఖ కార్యాలయంలో ‘హల్వా’ వేడుకను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఒమిక్రాన్‌ ఉధృతి కారణంగా ఈ ఏడాది ఈ వేడుకను ఆర్థికశాఖ పక్కనబెట్టింది. అందుకు బదులు స్వీట్లు ఇవ్వనుంది. బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన తర్వాత ‘లాక్‌`ఇన్‌’లో ఉండే సిబ్బందికి తుదిరోజు మిఠాయిలు పంచనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img