Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఈ ఉగాదికీ లేనట్టే !

. విశాఖకు రాజధాని తరలింపు కోసం మూడేళ్లుగా యత్నం
. చట్టపరమైన అవరోధాలతో వెనుకంజ
. సీఎం క్యాంపు ఆఫీసైనా మార్చాలని నిర్ణయం
. సుప్రీంలో విచారణ వాయిదాతో మళ్లీ సందిగ్ధం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ఏర్పాటు కల నెరవేరడం లేదు. 2019 డిసెంబరులో అసెంబ్లీలో బిల్లు పెట్టిన దగ్గర నుంచి విశాఖకు పరిపాలన రాజధాని తరలించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని మూడేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ న్యాయపరమైన చిక్కులతో వెనుకంజ వేస్తున్నారు. తొలుత హైకోర్టు దీనిపై ప్రభుత్వానికి ఘాటుగానే హెచ్చరికలు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఏ ఒక్క కార్యాలయాన్ని అమరావతి నుంచి తరలించినా, దానిని వెనక్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సంబంధింత శాఖా కార్యదర్శి భరించాల్సి ఉంటుందని, వారిపైనే చర్యలుంటాయని గట్టిగా చెప్పింది. దీంతో విశాఖకు ఎప్పుడెప్పుడు తరలిపోవాలా అన్న వైసీపీ పాలకుల ఆరాటానికి బ్రేక్‌ పడిరది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అమరావతి రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వాస్తవానికి దీనికిముందే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మూడు రాజధానుల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వైసీపీ… ఈసారి దానిపై సమగ్రబిల్లు పెడతామని మళ్లీ ప్రచారం ప్రారంభించింది. అదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై ముందు నుంచి అప్పీలుకు వెళ్లని ప్రభుత్వం…చివరిరోజు రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంను ఆశ్రయించింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఎలాగైనా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని అమలు జరిపి చూపాలని వైసీపీ తాపత్రయపడుతోంది. ఇందుకోసం అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెట్టాలని యోచన చేస్తోంది. గతంలో శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ ఉండడం వల్ల బిల్లు తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మండలిలోనూ వైసీపీ సభ్యుల మెజార్టీ పెరిగింది. దీంతో ఉభయసభల్లో సునాయాసంగా బిల్లు ఆమోదింపజేసుకుని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లాలన్న వ్యూహంతో ఉంది. మరోపక్క మార్చి 22వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం విశాఖలో ప్రారంభించడం ద్వారా పరిపాలన రాజధాని తరలించినట్లుగా ప్రజలను భ్రమింపజేయాలని ప్రయత్నిస్త్తోంది. ఈలోగా న్యాయపరమైన చిక్కుల్లేకుండా చూసుకోవాలన్న ధ్యేయంతో సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతోంది. అయితే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో విచారణను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేయడంతో…రాజధాని పిటిషన్లపై త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనాన్ని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సోమవారం ప్రత్యేకంగా అభ్యర్థించారు. దానిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వాస్తవానికి దీనిపై గతవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్‌ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడిరది. ఈసారి ఏకంగా నెలపాటు వాయిదా వేసింది. దీంతో ఉగాదికి రాజధాని తరలింపు నిర్ణయంపై

ప్రభుత్వం మళ్లీ సందిగ్ధంలో పడిరది. ఉగాదికి వెళ్లాలా ? వద్దా ? ఆగితే ఉత్తరాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా ? వెళితే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయా ? అన్న అంశాలపై ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు.
పోర్ట్‌ అతిథిగృహంలో సీఎం క్యాంపు కార్యాలయం
ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించేందుకు వెసులుబాటు ఉండటంతో విశాఖకు క్యాంపు కార్యాలయం తరలించి ఇకపై అక్కడ నుంచే వివిధ శాఖల సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా పరిపాలనా రాజధాని హామీని నిలబెట్టుకోవాలని సీఎం యోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో కాకుండా ప్రస్తుతానికి వారానికి రెండు రోజుల పాటు సీఎం విశాఖలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస చేసేందుకు పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌ను సకల సౌకర్యాలతో అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. సీఎం నివాసం కోసం రిషికొండలో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అది పూర్తయ్యే వరకూ పోర్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఉంటారని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమైన అధికారులకు కూడా కార్యాలయం, బస ఏర్పాట్లు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు మార్చి 28కి విచారణను వాయిదా వేయడంతో ఉగాది ముహూర్తం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img