Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ఉక్కపోత

ఉష్ణోగ్రతలు తగ్గినా వేడి మంట
మరో మూడు రోజులు ఇంతేనంటున్న విపత్తుల సంస్థ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ‘స్వామీ… ఏమి నీ లీల…వేసుకోగానే తడిచిపోతుంది, విప్పగానే ఆరిపోతుంది’ ఈ సందేశం శుక్రవారం సోషల్‌ మీడియాలో భారీస్థాయిలో వైరల్‌ అయింది. దీనికి కారణం ఉక్కపోతను భరించడం ఎంత ఇబ్బందో ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర ప్రజలు…ఎండ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ భరించలేనంత తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. నాల్గురోజుల క్రితం 48 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు తాజాగా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గినప్పటికీ, వేడి మాత్రం అదే మోతాదులో మంట పుట్టించింది. దీనికితోడు ఉబ్బ తీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగింది. గాలి ఏమాత్రం లేకపోవడం, ఎండలో తీవ్రత ఎక్కువగా ఉండటం, దీనికి ఉక్కపోత తోడు కావడంతో ఆ విచిత్ర వాతావరణ పరిస్థితులకు ప్రజలు తల్లడిల్లారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చంటి పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఏసీల్లేకుండా పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో కరెంట్‌ పోయిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఎండ తీవ్రత కంటే ఈ ఉక్కపోతను తట్టుకోవడమే కష్టంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు ఉంటుందని విపత్తుల సంస్థ వెల్లడిరచింది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో శనివారం వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గుంటూరు 4, ఎన్టీఆర్‌ 7, పల్నాడు 4, కడప జిల్లాలోని 8 మండలాలు, వడగాడ్పుల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 46.2 డిగ్రీలు, కడప జిల్లా సిద్ధవటంలో 45.2 డిగ్రీలు, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 25 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రాకుండా ఉడాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడరాదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img