Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

‘ఉక్కు’ ఉద్యమానికి 900 రోజులు

నేడు విశాఖలో ‘కార్మిక సభ’

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ ప్లాంట్‌ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. ఉద్యోగ, కార్మిక, నిర్వాసిత సంఘాల అధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలు నేటికి 900వ రోజుకు చేరుకోనున్నాయి.

విశాలాంధ్ర బ్యూరోవిశాఖపట్నం/కూర్మన్నపాలెం : విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు నినాదంతో, 32 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం పన్నాగం పన్నింది. స్టీల్‌ ప్లాంట్‌లో నూరు శాతం వాటాలు ప్రైవేటు వారికి విక్రయించనున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనవరి 27న ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌లో అన్ని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళ సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 12న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ ప్లాంట్‌ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. ఉద్యోగ, కార్మిక, నిర్వాసిత సంఘాల అధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలు నేటికి 900వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న ‘కార్మిక సమాహార సభ’ ను జయప్రదం చేయాలంటూ నేతలు పిలుపునిచ్చారు. పోరాటాలతో, ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను చేజార్చుకోబోమని, ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడితే సహించబోమని, ఇప్పటికే వివిధ మార్గాల్లో చేపట్టిన ఆందోళనల ద్వారా కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు, జేఏసీ అధ్వర్యంలో 26 జిల్లాల్లో ఉక్కు కార్మిక చైతన్య భేరి నిర్వహిస్తున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల సహా అనేక మంది భాగస్వామ్యంతో 2021 ఫిబ్రవరి 12 నుంచి ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దిల్లీలోనూ కార్మిక సంఘాల నేతలు తమ గొంతు వినిపించారు.
900 రోజుల పోరాటానికి దక్కని హామీ
అర్ధ శతాబ్దం కిందట విశాఖ ఉక్కు`ఆంధ్రుల హక్కు’ నినాదంతో చేపట్టిన ఉద్యమం నేపథ్యంలో ఈ ప్లాంటు నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 66 గ్రామాల్లో 22 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు.
1971లో శంకుస్థాపన చేస్తే రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఆరంభమైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు పరిశ్రమ వల్ల నిర్వాసితులైన వారికి పరిహారం, ఉద్యోగ హామీలు ఇంత వరకు నెరవేరలేదు. కేంద్రం కఠిన నిర్ణయాలతో పరిశ్రమ అనేక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం లేకుండా, ముడి సరకు సరఫరా చేయకుండా అవాంతరాలు సృష్టిస్తోంది. జులై 26 నాటికి పరిశ్రమలో బొగ్గు నిల్వలు కూడా నిండుకున్నాయి. క్యాపిటల్‌ రీస్ట్రక్చరింగ్‌ చేస్తూ బ్యాంకు రుణాలను మూలధనంలో కలపాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రెండేళ్లపాటు బ్యాంకు అప్పులు, వడ్డీలపై మారటోరియం విధించాలని, పరిశ్రమను 7.3 మిలియన్‌ టన్నుల పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆందోళన చేపడుతున్నారు. సెయిల్‌, ఎన్‌ఎండీసీ నుంచి ఉత్పత్తి ఖరీదుకే ఇనుప ఖనిజం ఇప్పించాలని, కేంద్రం రూ.5 వేల కోట్ల అత్యవసర ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. రైల్వే రేట్లును అందుబాటులో ఉంచాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా సెయిల్‌లో కలపాలని అభ్యర్థిస్తున్నారు.
నేడు కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ
విశాఖ ఉక్కు అఖిలపక్ష పోరాట కమిటీ అధ్వర్యంలో ఆదివారం వాడవాడల కార్మిక చైతన్య భేరి ర్యాలీలను నిర్వహించారు. గంగవరం, పెదగంట్యాడ, అగనంపూడి, వడ్లపూడి, కూర్మన్నపాలెం నిర్వాసితుల కాలనీలలో ఈ ర్యాలీలను ప్రారంభించారు. ఈ ర్యాలీలో కార్మిక సంఘం నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, జె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం కూర్మన్నపాలెం ఉక్కు నిర్వాసితుల రిలే నిరాహార దీక్షా శిబిరం నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమై శ్రీహరిపురం మీదుగా విశాఖ కలెక్టర్‌ కార్యాలయానికి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత, కార్మిక సంఘ నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img