Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఉత్తమ బోధన.. ఉపాధి కల్పన

ఇదే యూనివర్సిటీల ప్రధాన లక్ష్యం
తక్షణమే అధ్యాపకుల పోస్టులుభర్తీ చేయాలి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికిడిగ్రీ కాలేజీ
ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం ఉండదు
ఉన్నతవిద్య సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉత్తమ బోధన, ఉపాధి కల్పనే లక్ష్యంగా యూనివర్సిటీల్లో ప్రమాణాల పెంపుదలకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉన్నత విద్యపై క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని, ఆ విద్య నాణ్యతతో కూడినదై ఉండాలన్నారు. మంచి చదువుతోనే పేదల కుటుంబాల తలరాతలు మారుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం అత్యంత కీలక భూమిక వహించే విశ్వవిద్యాలయాలను వచ్చే మూడేళ్లలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ తక్షణమే చేపట్టాలని, మంచి అర్హతా ప్రమాణాలు కలిగిన వారిని నియమించాలని సూచించారు. అప్పుడే నాణ్యమైన విద్యను అందించగలుగుతామని, విద్యాప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్రతి యూనివర్సిటీ వీసీ తన హయాంలో మంచి మార్పులు తీసుకురావాలన్నారు. ఉద్యోగాల కల్పన దిశగా కోర్సులు ఉండాలన్నారు. విద్యార్థి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. జీఈఆర్‌ రేషియోను 2025 నాటికల్లా 70 శాతం అందుకోవాలని, విద్యాదీవెన, వసతి దీవెనలాంటి పథకాలతో కచ్చితంగా దీన్ని అందుకుం టామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలున్నా ఫీజురీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదని, ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లోనూ ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను, ఇతర ప్రయివేటు కాలేజీల్లోలాగే సమానంగా ఫీజులు చెల్లిస్తామన్నారు. దీనివల్ల ఆర్థికంగా యూనివర్సిటీలు స్వయం సమృద్ధి సాధిస్తాయని ఆకాంక్షించారు. ఇక నుంచి ప్రతివారం ఒక వీసీతో సమావేశమై యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన తోడ్పాటుపై చర్చించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల్లో నాక్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో ఇంటిగ్రేట్‌ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకడిగ్రీ కళాశాల ఉండేలే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి ఒత్తిడి లేదని సీఎం పునరుద్ఘాటించారు. చాలా విద్యాసంస్ధ్థలలో మౌలికసదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే…. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మెరుగైన రీతిలో వాటిని నడుపుతుంది. దాతల పేర్లు కొనసాగుతాయి. అలాగాకుండా తామే నడుపుకుంటామంటే భేషుగ్గా నడుపుకోవచ్చునని, దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయం అందరికీ స్పష్టం చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్‌, టెక్ట్స్‌బుక్స్‌తో పాటు ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌కాస్ట్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img