Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ఉత్తేజంగా సీపీఐ జాతీయ మహాసభలు ప్రారంభం

. తరలివచ్చిన దేశవిదేశీ ప్రతినిధులు
. కిక్కిరిసిన గురుదాస్‌ దాస్‌ గుప్తా ప్రాంగణం
. ప్రత్యేక ఆకర్షణగా రెడ్‌ ఫ్లాగ్‌మార్చ్‌
. జాతీయ జెండా ఎగురవేసిన కామ్రేడ్‌ ఏటుకూరి కృష్ణమూర్తి
. పార్టీ పతాకం ఆవిష్కరించిన సురవరం
. అమరుల స్థూపానికి ఈడ్పుగంటి నివాళి

వామపక్ష ఐక్యతకు మరింత బలం, సంఫీుభావం అవసరం. బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ప్రజాస్వామిక, వామపక్ష శక్తుల ఐక్యత మరింత బలంగా మారాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాలను కలిసికట్టుగా నిర్వహించాలి.

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో గురుదాస్‌ దాస్‌ గుప్తా ప్రాంగణం (ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటరు) లోని షమీమ్‌ ఫైజీ హాలులో శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, సీపీఐ, వామపక్ష పార్టీల నేతలు పెద్దఎత్తున తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయవాడ బందరురోడ్డు నుంచి ప్రాంగణం వరకు అంతా ఎరువుమయంగా మారింది. ప్రతినిధుల రాకపోకలతో ఆ మార్గమంతా రద్దీగా కన్పించింది. యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధుల రెడ్‌ ఫ్లాగ్‌మార్చ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎత్తరా...మన ఎర్ర జెండా...అరుణకాంతుల దశలు నిండా... అమర వీరులకు జోహార్లు, సీపీఐ జిందాబాద్‌ నినాదాలతో ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఈ మహాసభల్లో మూడు ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, కామ్రేడ్‌ ఏటుకూరి కృష్ణమూర్తి కరతాళ ధ్వనుల నడుమ ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు జాతీయ గీతాన్ని ఆలపించారు. తొలుత ఏటుకూరి కృష్ణమూర్తిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, అతుల్‌కుమార్‌ అంజన్‌, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు జాతీయ జెండా ఎగురవేసే ప్రాంగణానికి తోడ్కొని వచ్చారు. స్వాతంత్రోద్యమ చరిత్ర, జాతీయ జెండా స్ఫూర్తితో మనమంతా ముందుకెళ్లాలని ఏటుకూరి కృష్ణమూర్తి సందేశమిచ్చారు. మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. అమర జ్యోతి వెలిగించిన ‘ఈడ్పుగంటి’ అమరవీరుల స్థూపాన్ని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ పూర్వపు చైర్మన్‌ కామ్రేడ్‌ ఈడ్పుగంటి నాగేశ్వర రావు ఆవిష్కరించారు, అమరజ్యోతిని వెలిగించి నివాళుల ర్పించారు. అనంతరం మహాసభలు (ప్రతినిధుల సభ) లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఆహ్వాన సంఘం అధ్య క్షులు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ స్వాగతోపన్యాసం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి, సీపీఐ (ఎంఎల్‌) జాతీయ నాయకులు దీపాంకర్‌ భట్టాచార్య, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బి) జాతీయ నాయకులు కామ్రేడ్‌ జి.దేవరాజన్‌ సందేశాలిచ్చారు. వివిధ దేశాలకు చెందిన సౌహార్థ్ర ప్రతినిధులతోపాటు సీపీఐ జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నేతలు వేదికను అలంకరించారు. జాతీయ మహాసభలకు అధ్యక్షవర్గంగా రామేంద్రకుమార్‌, సయ్యద్‌ అజీజ్‌ పాషా, డాక్టర్‌ గిరీష్‌, పి.సందోష్‌ కుమార్‌ ఎంపీ, నిషా సిద్దు, రామకృష్ణ పాండు, జంకి పాశ్వన్‌, మంజూ కావాసి, సుఖ్‌జిందర్‌ మహేసరి, సంఘం మిత్రా జీనా, డాక్టర్‌ వై.యుదిస్టర్‌ దాస్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (మాజీ ఎమ్మెల్సీ) జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, దోనేపూడి శంకర్‌, కృష్ణాజిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వర్లు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు. జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img